Saba Karim On Ravindra Jadeja : టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఇటీవలే మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ఆసియా కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల తర్వాత మోకాలి గాయం కారణంగా టోర్నమెంట్‌కే దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌నకూ అందుబాటులో ఉంటాడా..?లేదా అనేది అనుమానమే. అయితే తనకు నిర్వహించిన శస్త్రచికిత్స ఆపరేషన్ విజయవంతమైందని, త్వరలోనే వచ్చేస్తానని జడేజా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. ఈ క్రమంలో జడేజా పునరాగమనంపై టీమ్‌ఇండియా మాజీ సెలెక్టర్ సబా కరీం ప్రత్యేకంగా విశ్లేషించాడు. జడేజా మళ్లీ రావడం కచ్చితంగా సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు.
"జడేజాకు ఇది క్లిష్ట సమయం. గాయంతో ప్రధాన టోర్నీకి దూరమైన జడేజా మళ్లీ జట్టులోకి రావాలంటే చాలా కష్టపడాలి. అయితే జడేజాను ఓ విషయంలో అభినందించాలి. గాయం కారణంగా దూరమైన తర్వాత ఎక్కువ సమయం తీసుకోకుండానే రిథమ్‌లోకి వచ్చేస్తాడు. అయితే ఈసారి మాత్రం అంత సులభం కాదని చెప్పాలి. సహజంగానే జడేజా టాలెంట్ కలిగిన ఆటగాడు. ఫిట్‌నెస్‌తో ఉంటాడు. అయితే వయసు పెరుగుతున్న కారణంగా అదే ఫిట్‌నెస్‌ను కొనసాగించడం కష్టంతో కూడుకున్న వ్యవహారం. అందుకే విశ్రాంతి తీసుకుంటూనే ఫిట్‌నెస్‌పై శ్రద్ధపెట్టాలి. మానసికంగా దృఢంగా ఉంటేనే గాయం నుంచి కోలుకుని వచ్చాక మైదానంలో అద్భుత ప్రదర్శన ఇవ్వగలుగుతాడు" అని సబా కరీం వివరించాడు. టీ20 ప్రపంచకప్ నుంచి జడేజా వైదొలిగినట్లేనని చెప్పడం తొందరపాటు అవుతుందని ఇటీవల మీడియా సమావేశంలో టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.