ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్(Nathan Lyon) పట్ల అసూయగా ఉందని న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్(Ross Taylor) అన్నాడు. అతడిలా తనకు టీమ్ఇండియా జెర్సీ ఇవ్వలేదని తెలిపాడు. ఇటీవల జరిగిన క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాల్ని వెల్లడించాడు.
Taylor: 'నాథన్‌కు ఇచ్చి.. నాకెందుకు ఇవ్వలేదు?' - రాస్ టేలర్ నాథన్ లియోన్
టీమ్ఇండియా జెర్సీ.. తనకు ఇవ్వకపోవడం గురించి కివీస్ క్రికెటర్ రాస్ టేలర్ మాట్లాడాడు. ఆసీస్ ఆటగాడు నాథన్ లియోన్‌కు జెర్సీ ఇవ్వడం పట్ల అసూయగా ఉందని పేర్కొన్నాడు. ఇంతకీ ఈ జెర్సీ కథేంటి? ఏం జరిగింది?
ఈ ఏడాది ఆరంభంలో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో చారిత్రక విజయం అందుకుంది. అయితే, ఆ మ్యాచ్ ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్‌కు వందో టెస్టు. ఆ సందర్భంగా అజింక్యా రహానె నేతృత్వంలోని భారత్.. ఓ జెర్సీపై సంతకాలు చేసి లియోన్‌కు దానిని జ్ఞాపకంగా అందజేసింది.
గతేడాది ఫిబ్రవరిలో టీమ్‌ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. వెల్లింగ్టన్‌లో ఆడిన తొలి టెస్టు.. ప్రత్యర్థి ఆటగాడు రాస్ టేలర్‌కు వందో టెస్టు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా లియోన్‌కు ఇచ్చినట్లు సంతకాలు చేసిన జెర్సీ తనకు ఇవ్వలేదని టేలర్ అన్నాడు. ఈ విషయంలో లియోన్ పట్ల అసూయగా ఉందని చెప్పాడు.