అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా తన జీవిత చరిత్ర 'బ్లాక్ అండ్ వైట్' పుస్తకం మార్కెట్లోకి విడుదలైంది. భారత టీ20 లీగ్‌లో రాజస్థాన్ ఓనర్లలో ఒకరు తనను మొహంపై కొట్టాడని సంచలన విషయం బయటపెట్టిన టేలర్.. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో ఉన్న అనుబంధం గురించి వివరించాడు. 2011లో రాజస్థాన్ జట్టుకు రాస్ టేలర్ ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు రాహుల్ కూడా రాజస్థాన్ తరఫునే ఆడాడు. రాహుల్, ఇటీవల కన్నుమూసిన దిగ్గజ క్రికెటర్ షేన్‌వార్న్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాడు. ఈ క్రమంలో ద్రవిడ్‌తో కలిసి పులులను చూసేందుకు రంతోమ్‌బర్ జాతీయ పార్క్‌కు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనను తన ఆటోబయోగ్రఫీలో వెల్లడించాడు. భారతీయ క్రికెటర్లకు ఉన్న క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశానని పేర్కొన్నాడు. అలానే వారు సాధారణంగా బయటకు వెళ్లడం ఎంత కష్టమో తెలిసిందన్నాడు.
"ఒకసారి ఏదో మాటల సందర్భంగా మీరు ఎన్నిసార్లు పులిని చూశారని రాహుల్‌ను అడిగా. దానికి సమాధానంగా 'నేను ఇంతవరకు పులిని ఎప్పుడూ చూడలేదు. దాదాపు 21 యాత్రలకు వెళ్లినా ఒక్కసారి కూడా కనిపించలేదు' అని రాహుల్ అన్నాడు. '21 సఫారీలకు వెళ్లినా పులిని చూడలేదా..? అని నాకైతే ఆశ్చర్యమేసింది. సరేలే నేను డిస్కవరీ ఛానల్ చూస్తానని చెప్పా. ఆ తర్వాత.. మధ్యాహ్నం వేళ ద్రవిడ్‌తో కలిసి నేషనల్ పార్క్‌కు వెళ్లా. మేం ఉండే ప్రాంతం నుంచి ఎక్కువ దూరమేమీ లేదు. మా డ్రైవర్‌కు తన సహచరుడి నుంచి వచ్చిన సందేశం మమ్మల్ని ఎంతో ఆనందానికి గురి చేసింది. T- 17 ట్యాగ్ చేసిన పులి కనిపించిందని చెప్పడంతో దానిని చూసి రాహుల్ ద్రవిడ్ థ్రిల్‌గా ఫీలయ్యాడు. 21 సార్లు యాత్ర చేసినా కనిపించని పులి.. 22వ సారి మాత్రం కేవలం అర గంటలోనే సందర్శన భాగ్యం కలగడం అద్భుతమనిపించింది" అని వివరించాడు.