భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఫెయిల్ అయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 38 పరుగులే చేశాడు. దీంతో బీసీసీఐ.. వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడిని మిగిలిన రెండు టెస్టులకు ఆ బాధ్యతల నుంచి తప్పించింది. కేవలం ఆటగాడిగా జట్టులో కొనసాగించింది.
అయితే ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్‌ను తుది జట్టు నుంచి తప్పించి.. అతడి స్థానంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు చోటు ఇవ్వాలని క్రికెట్ అభిమానులు, మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ను వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించడంపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. అది పెద్ద విషయమేమి కాదని పేర్కొన్నాడు.
మూడో టెస్టు ప్రారంభానికి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హిట్ మ్యాన్ మాట్లాడుతూ.. "టీమ్‌లోని మొత్తం 17 మంది ప్లేయర్లకు అవకాశం ఉంది. టాలెంట్ ఉన్న ప్లేయర్స్‌కు టీమ్ మద్దతు ఎప్పుడూ ఉంటుంది. వైస్ కెప్టెన్సీని తొలగించడం పెద్ద విషయం ఏమీ కాదు. కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించిన సమయంలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ లేరు. అందుకే కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అసలు ఇదంతా పెద్ద విషయం కాదు" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.