Rohit Virat vs Pakistan :2023 వరల్డ్‌కప్‌లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కొన్ని గంటల్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్ హిస్టరీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌పై టీమ్ఇండియాదే పైచేయి. దీంతో ఈ మ్యాచ్‌లోనూ భారత్.. జైత్రయాత్రను కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా అందరి ఫోకస్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆయా ఐసీసీ ఈవెంట్లలో, టోర్నీల్లో భారత్-పాక్ మ్యాచ్‌ల్లో వీరిద్దరూ కీలక పాత్ర పోషించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
రోహిత్ శర్మ..టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గణాంకాలు పాకిస్థాన్‌పై మెరుగ్గా ఉన్నాయి. అతడు పాకిస్థాన్‌పై వన్డేల్లో ఇప్పటివరకూ 18 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో రెండు సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు సహా.. 52.76 సగటుతో 786 పరుగులు చేశాడు. 2019 వరల్డ్‌కప్‌లోనూ పాక్‌పై అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ 140 పరుగులు చేసి పాక్ బౌలర్లను శాసించాడు.
ఇక గత నెలలో జరిగిన 2023 ఆసియా కప్‌లోనూ రోహిత్ పాక్‌పై చెలరేగిపోయాడు. తొలి మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. సూపర్ 4లో మాత్రం మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 49 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 6 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. ఇక శనివారం నాటి మ్యాచ్‌లో కూడా రోహిత్ చెలరేగితే భారత్‌కు భారీ స్కోర్ ఖాయమని ఫ్యాన్ అంటున్నారు.