Rohit Sharma World Cup 2023 : కెప్టెన్‌గా కంటే ఓ బ్యాటర్‌గానే భారత జట్టులో తన పాత్ర కీలకమని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గత రెండేళ్లలో వివిధ ఫార్మాట్లకు సారథ్య బాధ్యతలు వహించిన హిట్ మ్యాన్.. అక్టోబరులో సొంతగడ్డపై ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా సన్నాహాలు, ఆటగాళ్ల గాయాలు, సెలక్షన్ తదితర అంశాల గురించి తాజాగా మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..
Rohit Sharma About Captaincy :నా తొలి ప్రాధాన్యం బ్యాటింగ్‌కే ఇస్తాను. దాని తర్వాతే కెప్టెన్సీ. టీమ్‌లో నా పాత్ర ప్రధానంగా బ్యాటర్‌గానే ఉండాలని అనుకుంటాను. భారీ స్కోర్లు సాధించి జట్టును గెలిపించడమే లక్ష్యంగా భావిస్తాను. దీంతో పాటు నాయకత్వ బాధ్యతలు కూడా సమర్థంగా నిర్వర్తించాలి. ఇక రానున్న ప్రపంచకప్ జట్టుకు సారథ్య బాధ్యతలు వహించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
నేనింత వరకు ఒక్క వన్డే ప్రపంచకప్‌ను అందుకోలేదు. అది నాకొక కల. దాని కోసం పోరాడటం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే ప్రపంచకప్ అంటే పళ్లెంలో తెచ్చి పెట్టి ఇవ్వరు. అందుకోసం ఎంతో శ్రమించాలి. 2011లో ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మా జట్టు మళ్లీ ఆ కప్పును ముద్దాడేందుకు శ్రమిస్తోంది. ప్రతి ఒక్కరూ ట్రోఫీ గెలిచే విషయంలో కసిగానే ఉన్నారు. మాకు మంచి జట్టుంది. మేమందరం మెరుగైన ఆటగాళ్లమే. ఇది సాధించగలమన్న ఆత్మవిశ్వాసం, నమ్మకం మా అందరిలోనూ ఉంది.
Rohit Sharma About Fitness : మాలో కొందరికి ఫిట్‌నెస్ సమస్యలున్నాయి. దీంతో గత ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ముందు వన్డేలు ఆడటం తగ్గించాం. అయితే ఇప్పుడు వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో చాలామంది టీ20లు ఆడట్లేదు. ప్రపంచకప్‌కు ముందు ప్రతి మ్యాచ్ ఆడేయకూడదు. రెండేళ్ల ముందు నుంచే ఈ విషయంలో చాలా ప్రణాళికలు వేసుకున్నాం. నేను, కోహ్లి టీ20లు ఆడకపోవడం గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ జడేజా కూడా టీ20లు ఆడట్లేదు. అతన్ని అడగరేం? ప్రపంచకప్ సంవత్సరంలో ఆటగాళ్లందరూ యాక్టివ్‌గా ఉండేలా చూస్తున్నాం. ఇప్పటికే మా జట్టులో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పుడు కూడా ఆ గాయాల భయం మమల్ని వెంటాడుతోంది. అందుకే ఏమాత్రం అవకాశం ఉన్నా ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నాం. బీసీసీఐతో కూడా ఈ విషయం గురించి మాట్లాడాం.
Rohit Sharma About Surya Kumar Yadav : ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా వన్డేల్లో మెరుగయ్యేందుకు బాగా కష్టపడుతున్నాడు. ఈ ఫార్మాట్లో ఎక్కువ అనుభవం ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. అందుకు తగ్గ దృక్పథం అలవరుచుకోవడానికి కూడా సూర్య కుమార్ ప్రయత్నిస్తున్నాడు. అలాంటి ఆటగాడికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఆత్మవిశ్వాసం పెంచేందుకు చూడాలి. ఐపీఎల్‌లో ఈ ఏడాది కొన్ని మ్యాచ్‌ల్లో అతను పెద్దగా పరుగులు సాధించలేదు. కానీ తర్వాత ఎలా ఆడాడో అందరూ చూశారు. 'రెండు మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా పర్వాలేదు, నువ్వు నిలదొక్కుకుంటే జట్టును గెలిపించగలవు'.. అంటూ అతడిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి ప్రయత్నిస్తున్నాం.