Rohit Sharma World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ఇండియా ఇప్పుడు అఫీషియల్‌గా సెమీస్‌కు చేరింది. ఈ క్రమంలో క్రికెట్ లవర్స్‌తో పాటు టీమ్ఇండియా సంబరాలు చేసుకుంటోంది. ఇదే జోష్‌తో రానున్న మ్యాచ్‌లు ఆడుతాం అంటూ రోహిత్ సేన ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక సెమీస్‌కు చేరడం పట్ల భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. తమ తొలి లక్ష్యం ఇప్పుడే పూర్తయిందని.. రానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. అలాగే డీఆర్‌ఎస్‌ను తీసుకొనే విషయంలో వికెట్ కీపర్, బౌలర్‌కే నిర్ణయాన్ని వదిలేసినట్లు వెల్లడించాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ తమ పాత్రను మంచిగా పోషిస్తున్నారని అభినందించాడు.
"ప్రపంచకప్ మొదటి మ్యాచ్ నుంచి మా ఆటతీరు పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పుడు అఫీషియల్‌గా సెమీస్‌కు చేరుకోవడం కూడా ఆనందంగా ఉంది. ఈ విజయంతో మా తొలి లక్ష్యం పూర్తయింది. తొలుత సెమీస్‌కు చేరుకోవాలనే ధ్యేయంతోనే ఆడాం. ఇప్పుడు ఫైనల్స్‌పై గురి పెడతాం. ఇప్పటి వరకు జరిగిన ఏడు మ్యాచుల్లోనూ మేం ఆడిన తీరు పటల సంతృప్తిగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకోవడమే కాకుండా జట్టుకు కూడా అండగా నిలుస్తున్నారు. స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచడం వల్ల మా బౌలర్లకు మరింత స్వేచ్ఛ లభిస్తోంది. 350+ స్కోరు ఎలాంటి పిచ్‌పైనైనా మంచి టార్గెటే. శ్రేయస్ అయ్యర్ ఆడిన తీరు అద్భుతం. మానసికంగా ఎంతో దృఢంగా ఉండే అయ్యర్ ఇలాంటి ఇన్నింగ్స్‌లను ఈజీగా ఆడేస్తాడు. సూర్యకుమార్ కూడా జట్టుకు కీలకమైన పరుగులు అందించాడు. ఇక మా బౌలర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అనే అనాలి. ఇంగ్లాండ్‌తో అదరగొట్టిన వారు మరోసారి శ్రీలంకపైన కూడా అద్భుత ప్రదర్శన చేశారు. సిరాజ్ నాణ్యమైన బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొత్త బంతితో అతడు అద్భుతాలు చేస్తాడు. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించి జట్టును గెలిపించిన తీరు బాగుంది. ఇదే ఊపును చివరి వరకూ కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక షమీ బౌలింగ్‌లో రివ్యూ విషయంలో నిర్ణయం బౌలర్, వికెట్ కీపర్‌కే వదిలేశాను. బంతి గమనం వారిద్దరికే బాగా తెలుస్తుంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిపై నాకు నమ్మకం ఉంది. డీఆర్‌ఎస్‌లో ఇవాళ ఒక నిర్ణయం అనుకూలంగా వచ్చింది. అయితే మరొకటి చేజారింది. ఇక తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనున్నాం. ఈ వరల్డ్ కప్‌లో సఫారీ జట్టు అద్భుతంగా ఆడుతోంది. తప్పకుండా కోల్‌కతా వేదికగా జరగబోయే ఆ మ్యాచ్‌ను ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నాను" అని రోహిత్ శర్మ వెల్లడించాడు.