Rohit Sharma T20 Captaincy :రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ముంబయి ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం వల్ల సోషల్ మీడియా అట్టుడికిపోతోంది. రోహిత్ శర్మను కెప్టెన్ పదవి నుంచి తొలగించి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యను తీసుకురావడం పట్ల క్రికెట్ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ అభిమానులైతే సోషల్ మీడియాలో ముంబయి ఫ్రాంచైజీని తిట్టిపోస్తున్నారు.
అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ముంబయి ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫామెన్స్ మహేలా జయవర్ధనే చెప్పినప్పటికీ ఈ సీజన్లో రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం గురించి ఎలాంటి స్పష్టమైన కారణం అయితే తెలియట్లేదు. ఇప్పటికీ మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను ఇలా పక్కన పెట్టడం పట్ల పలు భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.
ఈ విషయం అంతర్గతంగా ఏదైనా జరిగి ఉండాలని కొందరు బలమైన నమ్మకం. మరోవైపు రోహిత్ తానే సారథి బాధ్యతలకు స్వస్తి పలికి ఉండచ్చని మరికొందరి మాట. గత మూడు సీజన్లలో జట్టు ప్రదర్శన గొప్పగా లేకపోయినప్పటికీ మార్కెటింగ్ పరంగా కూడా రోహిత్ విలువ ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు హార్దిక్‌ను అంత మొత్తం చెల్లించి మరీ గుజరాత్ నుంచి ముంబయికి తీసుకు వచ్చిన ప్రయత్నం చూస్తుంటే మేనేజ్మెంట్ ఏమిటో ఇట్టే అర్థమవుతుందని, పాండ్య కూడా కెప్టెన్సీ హామీ మేరకే ముంబయి తిరిగి వచ్చుంటాడంటూ మరికొందరు గుసగుసలాడుతున్నారు.