తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పరిస్థితులు అనుకూలించకపోయినా.. అద్భుతంగా ఆడాం' - Rohit Rahul openers

న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో(IND vs NZ T20) గెలిచి సిరీస్​ను సొంతం చేసుకుంది టీమ్​ఇండియా. ఈ నేపథ్యంలో మాట్లాడిన టీమ్​ఇండియా టీ20 సారథి రోహిత్ శర్మ(Rohit Sharma News).. ప్రతి ఒక్కరూ గొప్పగా రాణించారని కొనియాడాడు. మరోవైపు ఇన్నింగ్స్ ఓపెనింగ్​ చేయడాన్ని ఆస్వాదిస్తామని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

rohit sharma
రోహిత్ శర్మ

By

Published : Nov 20, 2021, 10:28 AM IST

Updated : Nov 20, 2021, 10:52 AM IST

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లోనూ(IND vs NZ T20) టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్​ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma News) తన జట్టు బాగా ఆడిందని, ప్రతి ఒక్కరూ గొప్పగా రాణించారని మెచ్చుకున్నాడు. పరిస్థితులు అనుకూలించకపోయినా తాము ఆడిన తీరు అద్భుతమని తెలిపాడు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడతారనేది తమకు తెలుసని, వాళ్లు తొలుత మంచి షాట్లు ఆడారన్నాడు. ఒక్క వికెట్‌ పడితే చాలని సహచరులతో చెప్పానన్నాడు. వారిని కట్టడి చేయడానికి తమ బౌలర్లు బాగా కృషి చేశారన్నాడు.

"నైపుణ్యమున్న ఆటగాళ్లతో మా జట్టు బలంగా ఉండటం శుభపరిణామం. అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ నిలకడగా రాణిస్తున్నారు. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనివ్వడం చాలా ముఖ్యమైన విషయం. ఇక ఇతర విషయాల గురించి వాళ్లే చూసుకుంటారు. ఇదో యువకుల జట్టు. ప్రస్తుతమున్న ఆటగాళ్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. అలాగే తర్వాతి మ్యాచ్‌లో మార్పులు చేర్పులపై ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు అవుతుంది. జట్టుకు ఏది అవసరమో అదే చేస్తాం. ఇప్పుడు ఎవరైతే రాణిస్తున్నారో వాళ్లని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరోవైపు అవకాశాలు రాని వారికి కూడా సమయం, సందర్భాన్ని బట్టి ఆడే వీలు కల్పిస్తాం. ఇక తొలి మ్యాచ్‌ ఆడుతున్న హర్షల్ పటేల్‌ తానేంటో చూపించాడు. అతడు నైపుణ్యమున్న బౌలర్. మంచు ప్రభావమున్న ఇలాంటి పరిస్థితుల్లోనూ నిజంగా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు"

--రోహిత్ శర్మ, టీమ్​ఇండియా కెప్టెన్.

మేం ఇద్దరం ఆస్వాదిస్తాం: రాహుల్‌

మరోవైపు రోహిత్‌, తానూ.. ఓపెనింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తామని కేఎల్‌ రాహుల్‌(Rohit Rahul) అన్నాడు. హిట్‌మ్యాన్‌ బ్యాటింగ్‌ అంటే తనకెంతో ఇష్టమని, అతడిది క్లాస్‌ బ్యాటింగ్‌ అని చెప్పాడు. ఎవరైనా బౌలర్‌ తనని ఇబ్బందులకు గురిచేస్తే.. రోహితే స్వయంగా ఆ బౌలర్‌పై ఎదురు దాడికి దిగుతాడని చెప్పాడు. దీంతో తనపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపాడు. తమ ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉందని, టాప్‌ ఆర్డర్‌లో ఎలా పరుగులు చేయాలో తమకు తెలుసని వివరించాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియాకు శుభారంభం చేసి మంచి స్కోర్లు అందించాలనుకుంటున్నట్లు రాహుల్‌ చెప్పాడు.

ఇదీ చదవండి:

వరుసగా ఐదు సార్లు.. రోహిత్-రాహుల్ అరుదైన ఫీట్

Last Updated : Nov 20, 2021, 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details