మరో రోజులో భారత్‌లో క్రికెట్ పండగ సందడి మొదలుకానుంది. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 16వ సీజన్ షురూ కానుంది. ఇప్పటికే ప్లేయర్స్ అంతా ప్రాక్టీస్ చేస్తూ చెమటోడుస్తున్నారు. మ్యాచులు ఆడేందుకు రెడీ అయ్యారు. అయితే తాజా మెగా టోర్నీకి.. గాయాల కారణంగా దూరమైన ఆటగాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. దీంతో యంగ్ ప్లేయర్స్‌కు సత్తా చాటేందుకు మంచి అవకాశం దక్కింది. అయితే ఎంత మంది అవకాశాలు వచ్చిన.. అందరూ ఎక్కువగా ఆలోచించేది మొదటగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ గురించే. అతడు ఐపీఎల్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు? అతడికి అవకాశం ఎప్పుడు దక్కుతుంది అనే చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా సచిన్, అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ముంబయి ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడతడి గాయం అర్జున్‌కు వరంగా మారనుంది. కాగా, 2021లో ముంబయి ఇండియన్స్ టీమ్‌లో చేరిన అర్జున్.. ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో కూడా ఆడలేదు.
ఇప్పటికే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఐదు ట్రోఫీలను ఐదు టైటిళ్లను ముద్దాడిన ముంబయి ఇండియన్స్.. గత సీజన్‌తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే ఈ సారి ఎలాగైనా పట్టుదలతో ఉంది. కానీ, బ్యాటింగ్ విభాగం పక్కనపెడితే.. బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది! స్టార్ పేసర్ బుమ్రాతో పాటు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. దీంతో ఆల్‌రౌండర్ అర్జున్ తెందుల్కర్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం అందింది. అర్జున్‌కు ఛాన్స్ ఇవ్వడం వల్ల ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగంలోనూ మరింత బలంగా మరే అవకాశముందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందని తెలుస్తోంది. క్యామెరూన్ గ్రీన్‌తో కలిసి ఆల్‌రౌండర్‌గా అతడు సేవలందించగలడని అనుకుంటుందట.
ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ.. అర్జున్ ఎపీఎల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. "అర్జున్ తన బౌలింగ్‌తో ఇప్పటికే చాలా మందిని ఆకట్టుకుంటున్నాడు. అతడు రెడీగా ఉంటే కచ్చితంగా ఎంపిక కోసం అతడి పేరును పరిశీలిస్తాను. అతడు ఇటీవలే గాయం నుంచి కోలుకున్నాడు. గత 6 నెలలుగా బౌలింగ్ పరంగా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అతడికి ఈ సారి అవకాశం దక్కొచ్చు" అని అన్నాడు.