Rohit Sharma Press Conference :సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఆతిథ్య జట్టుతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఇరుజట్ల మధ్య డిసెంబర్ 26న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ కాన్ఫరెన్స్‌లో ఓ రిపోర్టర్ 2024 టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ పాత్ర గురించి అడగ్గా, హిట్‌మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
'ఇది వరకు చెప్పనట్లే, మీకు టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని ఉందా?' అని రిపోర్టర్ రోహిత్‌ను అడిగాడు. దీంతో రోహిత్ 'ప్రతి ఒక్కరు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటారు. నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో, దానికి తొందరలోనే సమాధానం వస్తుంది' అని నవ్వుతూ బదులిచ్చాడు. 'వన్డే వరల్డ్‌కప్ ఓటమి తర్వాత మాకు బయటినుంచి పెద్ద ఎత్తన మద్దతు లభించింది. అది నాకు వ్యక్తిగతంగా ఎంతో ఉపయోగపడింది. ఒక బ్యాటర్‌గా నేను చేయాల్సినంత చేస్తాను. నా ముందు ఏదైతే ఛాలెంజ్ ఉంటుందో నేను దానికోసం తప్పకుండా కష్టపడతా. మేం సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ఇప్పటివరకూ గెలవలేదు. ఒకవేళ ఇప్పుడు గెలిస్తే, అది ప్రపంచకప్ ఓటమిని భర్తీ చేస్తుందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే వరల్డ్‌కప్‌ను దేనితోనూ పోల్చలేం' అని రోహిత్ అన్నాడు.
టీమ్ఇండియా మహిళా జట్టు తాజాగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై టెస్టుల్లో విజయం సాధించడాన్ని రోహిత్ కొనియాడాడు. 'అమ్మాయిల జట్టు టెస్టు ఆడడం నాకు నచ్చింది. మేం ఇక్కడ్నుంచి వారి మ్యాచ్‌లు లైవ్‌లో చూశాం. వాళ్లు భవిష్యత్‌లో మరెన్నో టెస్టు మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటున్నా' అని అన్నాడు.