Rohit Sharma On World Cup Defeat :2023 వరల్డ్‌కప్‌లో భారత్ ఓటమి తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి ఆ విషయంపై మాట్లాడాడు. మెగాటోర్నీ ఫైనల్లో ఓటమి చెందడం తననెంతో బాధించిందని అన్నాడు. " వరల్డ్‌కప్ ఓటమి బాధ నుంచి ఎలా బయటకు రావాలో తెలియలేదు. ఓటమి అనంతరం కొన్ని రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు. అటువంటి పరిస్థితుల్లో నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉన్నారు. ఆ ఓటమి జీర్ణించుకోలేనిది. అయితే జీవితంలో ముందుకెళ్లాలి. కానీ, నిజంగా బాధను మర్చిపోయి లైఫ్‌లో ముందుకెళ్లడం కూడా అంత ఈజీ కాదు" అని రోహిత్ ఓ వీడియోలో చెప్పాడు.
ఇక వన్డే వరల్డ్‌కప్ చూస్తూ పెరిగిన రోహిత్, తనకు దానికంటే విలువైంది లేదన్నాడు. ప్రపంచకప్ కోసం ఇన్నాళ్లూ కష్టపడ్డా, టైటిల్ దక్కకపోవడం నిరాశపర్చిందని వీడియోలో పేర్కొన్నాడు రోహిత్. 'ఎక్కడ తప్పు జరిగిందని కొందరు అడుగుతున్నారు. టోర్నీలో మేము 10 మ్యాచ్‌ల్లో గెలిచాం. అయితే అందులో కూడా మేం కొన్ని తప్పులు చేశాము. తప్పులు లేకుండా ఏ గేమ్ ఉండదు. ప్రతీ గేమ్‌లో తప్పులుంటాయి' అని రోహిత్ అన్నాడు. ఇక 2023 ప్రపంచకప్ ఫైనల్లో టీమ్ఇండియాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే.
Rohit Sharma World Cup 2023 Stats : ఈ ప్రపంచకప్‌లో రోహిత్ దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో జట్టుకు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్ నుంచే తనదైన శైలిలో బౌలర్లపై ఎటాక్ చేస్తూ, పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో రోహిత్ 11 మ్యాచ్‌ల్లో 54.27 సగటుతో 597 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 31 సిక్స్‌లు బాది టోర్నీలోనే టాప్‌లో నిలిచాడు.