Rohit Sharma News: టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ.. ఫిట్‌నెస్ పరంగా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారని పేర్కొన్నాడు. ఆ స్థాయి ఫిట్‌నెస్ మెయిన్‌టెయిన్ చేయడమే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ముందున్న అతి పెద్ద సవాలని అగార్కర్ అభిప్రాయపడ్డాడు.
'ఇంతకు ముందు టీమ్ఇండియా కెప్టెన్లుగా పని చేసిన మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ ఫిట్‌గా ఉండేవాళ్లు. ఫిట్‌నెస్ విషయంలో మిగతా ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచారు. చాలా అరుదుగా మ్యాచులకు దూరమయ్యేవారు. ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ.. వాళ్ల స్థాయి ఫిట్‌నెస్‌ని నిలుపుకోవడం కష్టమేననిపిస్తోంది. అలా అయితే, అన్ని మ్యాచులకు అతడు అందుబాటులో ఉండలేడు. వన్డే ఫార్మాట్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించాక అతడు గాయపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. ఇలాంటివి జట్టు ప్రదర్శనపై చాలా ప్రభావం చూపిస్తాయి. కెప్టెన్‌గా జట్టుని నడిపించినంత కాలం అతడు ఫిట్‌గా ఉండటం పెద్ద సవాలే. కానీ, అతడు ఫిట్‌నెస్ కాపాడుకుంటూ అన్ని మ్యాచులకు అందుబాటులో ఉంటే.. టీమ్‌ఇండియాపై సగం భారం తగ్గుతుంది. ఆటగాళ్లను దగ్గరి నుంచి గమనించే అవకాశం ఉంటుంది. తద్వారా రానున్న టీ20, వన్డే ప్రపంచ కప్‌లకు అత్యుత్తమ జట్టుని తీర్చిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది' అని అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు.