వరుసగా మూడో సిరీస్‌ను భారత్ కైవసం చేసుకొంది. శ్రీలంకపై వన్డే, టీ20 సిరీస్‌లను దక్కించుకొన్న విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌పైనా వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. మూడేళ్ల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో శతకం సాధించాడు. గిల్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ టోర్నీలోనే అత్యధిక పరుగుల వీరుడిగా మారాడు. అలాగే కీలక సమయంలో వికెట్లను తీసిన శార్దూల్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం గిల్, శార్దూల్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలతో ముంచెత్తాడు.
"మా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. మా ప్రణాళికలకు అనుగుణంగా ఆడాం. శార్దూల్ ప్రత్యేకంగా నిలిచాడు. కీలక సమయంలో వికెట్లు తీశాడు. అందుకే జట్టు సహచరులంతా అతడిని మాంత్రికుడిగా అభివర్ణిస్తారు. సరైన సమయంలో బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇలాంటి అద్భుతమైన మరిన్ని మ్యాచ్‌లను ఇంకా ఆడాలి. కుల్‌దీప్ యాదవ్ చేతికి ఎప్పుడు బంతినిచ్చినా బ్రేక్ ఇస్తూ ఉంటాడు. రిస్ట్ స్పిన్నర్లు అద్భుతం చేయగలరు."
"గత ఆరు మ్యాచుల్లో అద్భుతంగా ఆడాం. 50 ఓవర్ల క్రికెట్‌లో సరైన నిర్ణయాలను తీసుకొంటూ ముందుకు సాగుతున్నాం. చాలా నిలకడగా ఆడుతున్నాం. షమీ, సిరాజ్ లేకుండా రిజర్వ్ బెంచ్‌పై ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకొన్నాం. చాహల్, ఉమ్రాన్‌కు ఛాన్స్ ఇచ్చి ప్రయత్నించాం. ఒత్తిడిలో ఎలా ఆడతారనేది తెలుసుకోవాలని భావించాం. మేం భారీ స్కోరు సాధించాం. అయితే ఇంత లక్ష్యమైనా సరే సురక్షితం కాదని నాకూ తెలుసు. 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికైన శుభ్‌మన్ గిల్ దానికి పూర్తి అర్హుడు. గత ఇన్నింగ్స్‌లకు సంబంధించిన భావోద్వేగాలను గిల్ ఏమాత్రం తన వద్ద అట్టిపెట్టుకోడు. ఎప్పటికప్పుడు తాజాగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం అభినందనీయం" అని రోహిత్ వెల్లడించాడు.