Rohit Sharma Last World Cup :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రోహిత్ వ్యక్తిగత కోచ్ దినేశ్ లాడ్. ఓ ఇంటర్వ్యూలో రోహిత్ వయసు, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఉన్న విజయావకాశాలపై మాట్లాడాడు. 'రోహిత్‌కు ఈ వరల్డ్‌కప్పే చివరిది కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అతడి వయసు 36 ఏళ్లు. మళ్లీ వచ్చే ప్రపంచకప్ నాటికి అతడికి 40 సంవత్సరాలు నిండుతాయి. టీమ్ఇండియా ఆటగాళ్లు ఆ వయసులో అంతర్జాతీయ టోర్నీలు ఆడతారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఈ విషయం రోహిత్‌కు కూడా తెలుసు. అందుకని ఈసారి ఎలాగైనా దేశం కోసం ప్రపంచకప్‌ను ముద్దాడాలని హిట్‌మ్యాన్ ఉవ్విళ్లూరుతున్నాడు' అని దినేశ్ లాండ్. మరోవైపు కోహ్లి ఆటతీరుపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు లాడ్. 'ప్రస్తుతం విరాట్ దూకుడు చూస్తుంటే.. ఇదే వరల్డ్‌కప్‌లో అతడు తన 50వ వన్డే సెంచరీని పూర్తి చేస్తాడేమో అనిపిస్తోంది' అని చెప్పాడు.
అటు సెంచరీలు.. ఇటు వికెట్లు..
ఈ టోర్నీలో టీమ్ఇండియా జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో భీకరమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. అటు బ్యాటర్లు సెంచరీలు, హాఫ్ సెంచరీలతో చెలరేగుతుంటే.. ఇటు బౌలర్లు సైతం తగ్గేదేలే అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. టాప్ ఆర్డర్లో ఉన్న 5 బ్యాటర్లలో ఇప్పటికే నలుగురు సెంచరీలు కూడా బాదారు. ఈ మెగా పోరులోనే విరాట్ 2 సెంచరీలు బాది తన 49వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా రోహిత్, శ్రేయస్, రాహుల్ సైతం తలో సెంచరీ నమోదు చేశారు. శుభ్‌మన్ గిల్ సైతం 3 హాఫ్ సెంచరీలు బాది ఆకట్టుకుంటున్నాడు. ఇక రాణించాల్సిందల్లా సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే.
బౌలింగ్‌లో భళా..
ప్రత్యర్థ బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు టీమ్ఇండియా పేస్ త్రయం. అద్భుతమైన బౌలింగ్ షాట్స్‌తో ప్రత్యర్థి జట్లను మట్టికరిపిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్‌లు కలిసి ఏకంగా 45 వికెట్లు పడగొట్టారు. స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు కూడా బౌలింగ్‌లో భేష్ అనిపించుకుంటున్నారు.