Rohit Sharma International Sixes :భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ బుధవారంతో ముగిసింది. 2-1తేడాతో ఈ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్.. రాజ్‌కోట్ వేదికగా బుధవారం ఆడిన చివరి వన్డేలో 66 పరుగుల తేడాతో ఓడింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులను బ్రేక్ చేశాడు. అవేంటంటే..
353 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిగిన టీమ్ఇండియా.. మొదట్నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ రోహిత్ శర్మ.. తనదైన శైలిలో బౌండరీలతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా తన సిగ్నేచర్ పుల్ షాట్లతో స్టేడియంలోని ఫ్యాన్స్ ఉర్రూతలూగించాడు. ఈ క్రమంలోనే రోహిత్ 31 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. అప్పటికి జట్టు స్కోర్ 9.3 ఓవర్లలో 68 పరుగులు. అయితే రోహిత్ ఈ హాఫ్ సెంచరీని పవర్ ప్లే (తొలి 10 ఓవర్లలోపు) లోనే అందుకోవడం విశేషం. ఈ క్రమంలో 13 ఏళ్ల తర్వాత వన్డేల్లో తొలి పది ఓవర్లలో హాఫ్ సెంచరీ సాధించిన టీమ్ఇండియా బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు.
సిక్సర్ల రారాజు.. తన కెరీర్లో 451 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. ఇప్పటివరకు 551 సిక్స్‌లు బాదాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ (553)కు అతి చేరువలోకి వచ్చాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో 550+ సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ చేరాడు. ఈ లిస్ట్‌లో రోహిత్ కంటే ముందు ఒక్క క్రిస్ గేల్ మాత్రమే ఉన్నాడు.