టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) పరాభవంతో డీలా పడ్డ అభిమానులకు.. న్యూజిలాండ్‌పై క్లీన్‌స్వీప్(IND vs NZ T20 series) విజయంతో టీమ్‌ఇండియా కాస్త ఉపశమనాన్ని కలిగించింది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మనవాళ్లు సత్తాచాటారు. కొత్త కెప్టెన్ రోహిత్(Rohit Sharma Captaincy), కొత్త కోచ్ ద్రవిడ్(Dravid Coach).. ఘనంగా బోణీ కొట్టారు. ఈ సిరీస్‌లో రోహిత్ తన నాయకత్వ లక్షణాలతో ఆకట్టుకున్నాడు. అతనికి కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ సారథిగా ఏకంగా అయిదు టైటిళ్లు అందించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కొన్ని మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియాకు తాత్కాలిక కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఒక్క సిరీస్‌తో కెప్టెన్సీలో రోహిత్‌కు తిరుగులేదని చెప్పలేం కానీ.. ఇప్పటికే ఐపీఎల్‌లో, టీమ్‌ఇండియాకు తాత్కాలిక సారథిగా వ్యవహరించినపుడు ఆకట్టుకున్న హిట్‌మ్యాచ్ కివీస్‌తో సిరీస్‌లో తన నాయకత్వంపై సానుకూల అభిప్రాయం కలిగించాడు.
ఆ దిశగా..
టీ20ల్లో జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్(Rohit Sharma News) ముందున్న లక్ష్యం వచ్చే ఏడాది ఇదే ఫార్మాట్లో జరిగే ప్రపంచకప్‌ను అందుకోవడం. ఆ దిశగా జట్టును ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆ టోర్నీకి ముందే అత్యుత్తమ కూర్పును సిద్ధం చేసుకోవాలి. సీనియర్లకు అండగా ఉంటూ.. యువ ఆటగాళ్లకు అవకాశమిస్తూ ముందుకు సాగాలి. తొలి సిరీస్‌లో రోహిత్ కూడా ఇదే చేశాడని, తన నాయకత్వ లక్షణాలతో మెప్పించాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అశ్విన్‌పై అతను పెట్టిన నమ్మకం వమ్ము కాలేదు. ప్రస్తుత క్రికెట్లో ఎక్కువగా ప్రత్యర్థి బలహీనతలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా మ్యాచ్ మ్యాచ్‌కూ తుదిజట్టును మారుస్తున్నారు. కానీ రోహిత్ ఆ రకం కాదు. నిలకడగా ఆటగాళ్లకు అవకాశాలిస్తూ ఏ సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడమే అతని నైజం.