తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ శర్మపై మీమ్.. క్షమాపణలు చెప్పిన స్విగ్గీ - IPL LATEST NEWS

తాము ఎలాంటి దురుద్దేశంతో రోహిత్​పై మీమ్ చేయలేదని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. హిట్​మ్యాన్​పై పోస్ట్ పెట్టిన నేపథ్యంలో అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు సంస్థ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Rohit Sharma Fans Want to Boycott Swiggy After 'Vada Pav' Meme Creates Uproar on Twitter
రోహిత్ శర్మపై మీమ్.. క్షమాపణలు చెప్పిన స్విగ్గీ

By

Published : Apr 14, 2021, 4:54 PM IST

టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌, ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌శర్మ అభిమానులకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ క్షమాపణలు తెలియజేసింది. తాము ఎలాంటి దురుద్దేశంతో హిట్‌మ్యాన్‌పై మీమ్‌ను రీపోస్ట్‌ చేయలేదని తెలిపింది. ఆ చిత్రాన్నీ తాము రూపొందించలేదని స్పష్టం చేసింది. సరదా కోసమే దానిని పెట్టామని, ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదని అంగీకరించింది. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలని తాము భావించలేదని వెల్లడించింది. ఏదేమైనా తాము పల్టాన్స్‌తోనే ఉన్నామని తెలిపింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచుకు ముందు స్విగ్గీ ఓ ట్వీట్‌ చేసింది. పావ్‌బాజీ బండి వద్దకు డైవ్‌చేసి పావ్‌ తీసుకున్నట్టుగా రోహిత్‌శర్మ చిత్రం పెట్టింది. దానిపై 'దీనిని ఫోటోషాప్‌ చేశారని అసూయాపరులు అంటారు!' అని ఓ క్యాప్షన్‌ సైతం ఉంచింది. ఈ ట్వీట్‌ చూసిన హిట్‌మ్యాన్‌ అభిమానులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

స్విగ్గీ సంస్థపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఫోన్లలో యాప్‌ను తొలగిస్తున్న స్క్రీన్‌షాట్లను రీట్వీట్‌ చేశారు. ఫలితంగా స్విగ్గీ రేటింగ్‌పై ప్రభావం పడ్డట్టు తెలుస్తోంది. 'టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్‌, కోట్లాదిమంది ఆరాధించే రోహిత్‌ను అవమానించడాన్ని సహించబోం. ఇకపై ఈ వేదికలో ఎప్పుడూ ఆహారాన్ని తెప్పించుకోను' అంటూ చాలామంది సందేశాలు పెట్టారు. స్విగ్గీని బహిష్కరించాలంటూ హ్యాష్‌ట్యాగును ట్రెండింగ్‌ చేస్తున్నారు. దాంతో ఆ సంస్థ వివరణ ఇచ్చుకోక తప్పలేదు.

ABOUT THE AUTHOR

...view details