తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్‌శర్మ నాటౌట్‌.. థర్డ్‌ అంపైర్‌పై నెటిజన్ల ఫైర్ - రోహిత్ శర్మ ఐపీఎల్ 2022

IPL 2022 Rohit Umpire decision: గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాటౌట్‌ అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి విషయంలో థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని మండిపడుతున్నారు.

రోహిత్‌శర్మ నాటౌట్‌.. థర్డ్‌ అంపైర్‌పై నెటిజన్ల ఫైర్
IPL 2022 Rohit Umpire decision

By

Published : May 10, 2022, 10:51 AM IST

Updated : May 11, 2022, 6:19 AM IST

IPL 2022 Rohit Umpire decision: ఐపీఎల్​ 2022 సీజన్​లో థర్డ్​ అంపైర్​ తప్పుడు నిర్ణయం మరోసారి ఇంకో బ్యాటర్​ కొంపముంచింది. ఇప్పటికే ఈ సీజన్​లో థర్డ్​ అంపైర్​ తప్పుడు నిర్ణయాలకు ఆటగాళ్లకు బలయ్యారు. కోహ్లీ ఎల్బీ వివాదం ఎంతలా రచ్చ అయిందో తెలిసిన విషయమే. అయితే తాజాగా ముంబయి కెప్టెన్​ రోహిత్ శర్మ ఔట్​ విషయం మరోసారి వివాదానికి దారితీసింది. గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హిట్​మ్యాన్​ నాటౌట్‌ అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి విషయంలో థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని మండిపడుతున్నారు. కోల్‌కతా నిర్దేశించిన 166 పరుగుల మోస్తరు లక్ష్య ఛేదనలో ముంబయి తొలి ఓవర్‌లోనే కెప్టెన్‌ వికెట్‌ కోల్పోయింది. సౌథీ వేసిన చివరి బంతి.. రోహిత్‌ బ్యాట్‌ అంచుకు తాకుతున్నట్లు వెళ్లడంతో కీపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో కోల్‌కతా ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా అంపైర్‌ ఔటివ్వలేదు.

శ్రేయస్‌ అయ్యర్‌ రివ్యూకు వెళ్లడంతో సమీక్షించిన థర్డ్‌ అంపైర్‌.. అల్ట్రా ఎడ్జ్‌లో స్పైక్‌ కనిపించడంతో ఔటిచ్చాడు. అయితే, రీప్లేలో బంతి హిట్‌మ్యాన్‌ బ్యాట్‌కు కాస్త దూరంగా వెళ్తున్నట్లు కనిపించడం గమనార్హం. అది చూసి రోహిత్‌ కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. అతడు చేసేదిలేక నిరాశగా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్‌ చేస్తూ థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబయి 17.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ సీజన్‌లో తొమ్మిదో ఓటమి చవిచూసింది.

నెటిజన్ల విమర్శలు..

  • మనం చూసింది.. థర్డ్‌ అంపైర్‌ ఎందుకు చూడలేకపోయాడు. రోహిత్‌ నాటౌట్‌.
  • థర్డ్‌ అంపైర్‌కు 3 డీ గ్లాస్‌ అవసరం అనుకుంటా.
  • ఇది కచ్చితంగా సాంకేతికత తప్పిదం. బంతి రోహిత్‌ బ్యాట్‌ దగ్గరకు రాకముందే స్పైక్‌ కనిపించింది. థర్డ్‌ అంపైర్‌ కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది.
  • థర్డ్‌ అంపైర్‌ సరిగ్గా గమనించకుండానే అలా ఎలా ఔటిస్తాడు. దీన్నిబట్టి వాళ్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది. ఆ క్యాచ్‌ కూడా సరిగ్గా పట్టాడా లేదా అనేది కూడా చూడరా?
  • బీసీసీఐతో పాటు టోర్నీ నిర్వాహకులు కొంచెం సరిగ్గా పనిచేసే అంపైర్లను తీసుకురండి. ఇలాంటి తప్పుడు అంపైరింగ్‌ నిర్ణయాలు ఆటగాళ్ల శ్రమ, అంకితభావాన్ని దెబ్బతీస్తాయి. ఏదో ఒక రోజు ఇలాంటి తప్పులు ఫైనల్‌ లేదా ఫలితాలను ప్రభావం చేసేలా మారుతాయి. అలాంటివి మంచిది కాదు.
  • ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌ కనీసం హాట్‌స్పాట్‌ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయింది. ఫీల్డ్‌ అంపైర్లను వదిలేస్తే ఈసారి థర్డ్‌ అంపైర్లు మరీ దారుణంగా ఉన్నారు.


ఈ మ్యాచ్ ఓడిపోవడంపై రోహిత్​ మాట్లాడుతూ.. "మా బౌలింగ్‌ యూనిట్‌ చాలా గొప్ప ప్రదర్శన చేసింది. బుమ్రా మరింత గొప్పగా మెరిశాడు. అయితే, మేం బ్యాటింగ్‌ చేసిన తీరుకు చాలా నిరాశ చెందా. బ్యాట్స్‌మన్‌ ఏమాత్రం ఆడలేకపోయారు. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం అంత కష్టమేం కాదు. ఈ స్టేడియంలో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడిన నేపథ్యంలో పిచ్ ఎలా స్పందిస్తుందో అవగాహన ఉంది. ఇలాంటి లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు మంచి భాగస్వామ్యాలు కావాలి. కానీ, మేం అది చేయలేకపోయాం. కోల్‌కతా తొలి 10 ఓవర్లలో సుమారు 100 పరుగులు చేసింది. అయినా, మేం తిరిగి పుంజుకోవడం గొప్ప విషయం. బుమ్రా ప్రత్యేకంగా నిలిచాడు. ఈ సీజన్‌లో మా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో నిలకడ లోపించినట్లు ఉంది" అని వివరించాడు.

ఇదీ చూడండి: 'ఆ​ విషయంలో మూడో అంపైర్​ జోక్యం అవసరం'

Last Updated : May 11, 2022, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details