బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమ్‌ఇండియా ఓటమిని చవిచూసినప్పటికీ ఈ మ్యాచ్‌తో భారత ఆటగాళ్లు అరుదైన రికార్డులను అందుకున్నారు. బుధవారం టీమ్‌ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ఖాతాలో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది తన బౌలింగ్‌తో పవర్‌ప్లేతో పాటుగా డెత్ ఓవర్లలోనూ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పొదుపుగా బంతులేస్తూ రాణించాడు. 14 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీసిన ఈ హైదరాబాద్ కుర్రాడు.. 2022లో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాడిగా నిలిచాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలోనూ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్‌ను సిరాజ్ అధిగమించాడు.
మరోవైపు చేతి వేలి గాయం బాధిస్తున్నా జట్టును గెలిపించడానికి ఆఖరి వరకూ పోరాడిన రోహిత్ శర్మ కూడా అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 (ఇప్పటివరకు మొత్తం సిక్సులు 502) సిక్సులు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా చూసుకుంటే వెస్టిండీస్ ఆటగాడు క్రిస్‌గేల్ 553 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.