Rohit Sharma BCCI : వన్డే ప్రపంచకప్ ఫీవర్ ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు సాగిన ఈ మెగా టోర్నీ ఎన్నో మరిచిపోలేని అనుభూతులను ఇచ్చింది. వరస విజయాలతో దూసుకెళ్లిన టీమ్ఇండియాను ఫైనల్ దెబ్బ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. దీంతో అటు భారత జట్టుతో పాటు ఇటు క్రికెట్ లవర్స్.. తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఇదిలా ఉండగా.. జట్టులో కీలక మార్పులపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. రానున్న నాలుగేళ్లలో వైట్‌బాల్ క్రికెట్‌లో బోర్డు అనుసరించాల్సిన ప్లాన్స్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌తో బోర్డు చర్చించనుంది. ఈ క్రమంలో రోహిత్ వైట్‌బాల్ క్రికెట్ భవిత్వంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు.
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే రోహిత్ ఈ విషయంలో తన వైపు నుంచి క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. తన పేరును టీ20 ఫార్మాట్‌కు పరిశీలించకపోయినా కూడా ఇబ్బంది లేదని బోర్డుకు సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇక సెలక్టర్లు కూడా ఈ ఏడాది నుంచి యువతకు టీ20 జాతీయ జట్టులో భారీగా అవకాశాలు కల్పిస్తున్నారు. మరో ఏడు నెలల్లో టీ20 ప్రపంచకప్ ఉండటం వల్ల ఈ ప్లాన్ నుంచి వెనక్కి తగ్గే అవకాశాలు కూడా కనిపించటం లేదు.
ఇక శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ.. మూడో స్థానంలో గిల్ స్థిరపడటం వల్ల అజింక్య రహానేకు అవకాశాలు కష్టం కావచ్చు. మరోవైపు బ్యాకప్ వికెట్‌కీపర్ రూపంలో కేఎల్ రాహుల్ రెడీగా ఉన్నాడు. రోహిత్ కూడా తన కెరీర్‌లో ఇక టెస్ట్ మ్యాచ్‌లపైనే దృష్టిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2025 వరకు కొనసాగనుంది. అదే సమయంలో ఈ ఫార్మాట్‌కు కొత్త కెప్టెన్‌ను సిద్ధం చేసే బాధ్యతలను కూడా రోహిత్‌పైనే పెట్టే అవకాశాలున్నాయి.