Rohit Sharma BCCI :వరల్డ్ కప్ తర్వాత టీమ్ఇండియా ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌పై ఫోకస్ పెట్టింది. అలా వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉన్న భారత జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌కు పయనమవ్వనుంది. అయితే ఇందుకు సంబంధించిన తుది జట్టును గురువారం ప్రకటించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టులో యంగ్ ప్లేయర్స్‌తో పాటు రోహిత్ శర్మను ఆడించాలని భావిస్తోంది. కానీ ఈ విషయంపై రోహిత్ సుముఖత చూపించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ.. పట్టువదలకుండా రోహిత్‌ను ఈ జట్టులో చేర్చేందుకు బీసీసీఐ భారీ ప్లాన్స్ వేస్తోంది.
గతేడాది టీ20 ప్రపంచకప్ ఓటమి తర్వాత ఈ ఫార్మాట్లో రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్.. సౌతాఫ్రికాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్‌కు దూరంగా ఉండాలని అనుకున్నాడట. రోహిత్‌లాగా విరాట్ కూడా ఇదే డెసిషన్ తీసుకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రోహిత్ గైర్హాజరీలో టీ20లు, వన్డేల్లో టీమ్ఇండియాకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడు. కానీ గాయం కారణంగా హార్దిక్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు.