Rohit Sharma Asia Cup 2023 : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్.. తన కెరీర్లో అనేక మైలురాయిలను సాధించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లతోపాటు పాటు ఆసియా కప్‌లోనూ పలు రికార్డులను నమోదు చేశాడు. సచిన్ ఆడిన 6 ఆసియా కప్ టోర్నమెంట్లలో మొత్తం 900లకు పైగా పరుగులు సాధించాడు. అంతేకాకుండా.. తన చివరి మ్యాచ్ కూడా ఈ టోర్నమెంట్‌లోనే ఆడాడు. 2012 ఆసియా కప్ డిసెంబరులో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచే సచిన్ చివరిది.
అయితే త్వరలోనే ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఆసియా జట్లు పాల్గొనే ఈ టోర్నీ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే టీమ్ఇండియా మాజీ దిగ్గజం సచిన్ నెలకొల్పిన పలు రికార్డులను ఈ సారి కెప్టెన్ రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశముంది. ఎందుకంటే ఈ టోర్నీల్లో ఆడిన అనుభవం రోహిత్‌కు అధికంగా ఉండటం, స్థిరంగా రాణించడమే కారణం. మరి ఆ రికార్డులేంటి?
టీమ్ఇండియా తరఫున అత్యధిక స్కోరు
Highest average for India in Asia Cup :ఆసియా కప్‌లో టీమ్ఇండియా తరఫున అత్యధిక స్కోరు సచిన్ సాధించాడు. మొత్తం 23 వన్డేల్లో 21 ఇన్నింగ్స్‌లు ఆడి.. 85.4 స్ట్రైక్ రేట్‌తో 971 పరుగులు సాధించాడు. అంతేకాకుండా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో మొత్తంగా మూడో స్థానంలో నిలిచాడు. లంక మాజీ ప్లేయర్లు కుమార సంగక్కర, సనత్ జయసూర్య మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
సచిన్ తర్వాత ఇండియా తరఫున రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 22 మ్యాచుల్లో 21 ఇన్నింగ్స్ ఆడి 745 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 84.94గా ఉంది. సచిన్ రికార్డు బ్రేక్ చేయాలంటే రోహిత్‌కు ఇంకా 227 పరుగులు అవసరం. 2018లో జరిగిన టోర్నీలో రోహిత్ 5 మ్యాచుల్లోనే 300లకు పైగా పరుగులు సాధించడం విశేషం.
ఎక్కువ హాఫ్ సెంచరీలు
Highest Half Centuries In Asia Cup : ఆసియా కప్‌లో అత్యధిక అర్ధ సెంచరీల రికార్డు శ్రీలంక ప్లేయర్ కుమార సంగర్కర ఉంది. అతడు మొత్తం 8 సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు. 7 హాఫ్ సెంచరీలతో సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. మొదటి అర్ధ సెంచరీ 1997 టోర్నీలో చేయగా.. చివరి సారిగా 2012 లో చేశాడు. ఈ సారి వీళ్లద్దిరి రికార్డులను హిట్‌మ్యాన్ బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. 2018లో జరిగిన ఆసియా కప్‌లో సెంచరీతో పాటు హాఫ్ సెంచరీలూ సాధించాడు. రోహిత్ అభిమానులు ఈ రికార్డు సాధించాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.