Rohit Sharma Asia Cup 2023 : ప్రస్తుత తరం గొప్ప క్రికెట్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా రోహిత్‌కు మంచి రికార్డు ఉంది. అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా మంచి ఫామ్‌లోనే రాణిస్తున్నాడు. అయితే.. ఈ రెండు విషయాల్లో ఇండియన్ క్రికెట్ హిస్టరీకి సంబంధించి రాబోయే మూడు నెలలు అతని కెరీర్‌కు అత్యంత కీలకం. వీటిలో మంచి ప్రదర్శన ఇస్తే.. చరిత్రలో నిలిచిపోయే అవకాశాలున్నాయి. ఇంతకీ అవేంటంటే..
విరాట్ స్థానంలో రోహిత్.. ఆ ఘనత చూసి..
Rohit Sharma Captaincy :విరాట్ కోహ్లీకి సెలెక్టర్లకు మధ్య నెలకొన్న పరిస్థితుల్లో రోహిత్ టీమ్ఇండియా పగ్గాలు చేపట్టాడు. కెప్టెన్‌గా కోహ్లి ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడం వల్ల అతను రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో విఫలమవ్వడం.. విరాట్ కెప్టెన్సీ విషయంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో విరాట్ స్థానంలో ఎవరు కెప్టెన్ అయినా.. భారీగానే అంచనాలుంటాయి. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు రోహిత్‌ను సారథిగా ఎంపిక చేశారు. ఇక రోహిత్ అప్పటికే ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా 5 ఐపీఎల్ ట్రోఫీలు సాధించాడు. దీంతో అతను టీమ్ఇండియా కెప్టెన్ అయితే.. ఐసీసీ ఈవెంట్లలో అలాంటి ఫలితాల్ని అందిస్తాడని సెలెక్టర్లు ఆశించారు.
అయితే 2022లో భారత ఆసియా కప్ ఆడే సమయానికి రోహిత్ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర కూడా కాలేదు. అంతే కాకుండా 2018 లో ఆసియా కప్ గెలుచుకున్నప్పటికీ ఆ సమయానికి రెగ్యులర్ కెప్టెన్ కాదు. కానీ.. 2022లో అతనిలో ఒత్తిడి కనిపించింది. మైదానంలో అతని ప్రవర్తన, యువకుల్ని హ్యాండిల్ చేసే విధానం, ఆన్ ఫీల్డ్ స్వభావం తన సారధ్య బాధ్యతలపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి.
ఆ తర్వాత అదే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ-20 ప్రపంచ కప్‌లో అతని తీరులో చాలా మార్పు వచ్చింది. కెప్టెన్ బాధ్యతలు చేపట్టినప్పటి కంటే ఇప్పుడు రిలాక్స్డ్గా ఉన్నాడు. ఆసియా కప్ ఆడేందుకు టీమ్ ప్రకటించే సందర్భంలోనూ తను విలేకరులతో వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలు కూడా బాగున్నాయి.
Rohit Sharma About Team India : టీమ్ ఆటగాళ్ల స్వేచ్ఛ విషయంలోనూ రోహిత్లో మార్పు వచ్చింది. " ఒకట్రెండు మ్యాచుల్లో ప్రదర్శన సరిగా లేనంత మాత్రాన వాళ్లని జడ్జ్ చేయలేం. మా జట్టులో కుర్రాళ్లందరికీ చాలా సామర్థ్యముంది. క్లిష్ట సమయాల్లో వారిని ఇంకా ప్రోత్సహిస్తాం." అని ఒకానొక సందర్భంలో రోహిత్ అన్నాడు.