Team India: టెస్టుల్లో టీమ్‌ఇండియా ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మినహా దాదాపు అన్ని సిరీస్‌లు గెలుపొందింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో చారిత్రక బోర్డర్-గావస్కర్ సిరీస్ సాధించడం, ఆపై స్వదేశంలో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించడం మర్చిపోలేని అనుభూతులు. అలాగే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత ఇంగ్లాండ్‌ను దాని సొంత గడ్డపైనే 2-1 తేడాతో ఓడించడం కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం. ఇక ఇటీవల టీ20 ప్రపంచకప్ అనంతరం భారత్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను సైతం కోహ్లీసేన కైవసం చేసుకుంది. ఇప్పుడు తాజాగా దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టులోనే ఆకట్టుకుంది. దీంతో 2021కి ఘనంగా వీడ్కోలు పలికింది.
అయితే, ఈ విజయాల్లో ఇద్దరు క్రికెటర్లు కీలక పాత్ర పోషించారు. అందులో ఒకరు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కాగా, మరొకరు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. రోహిత్ ఈ ఏడాది మొత్తం 11 టెస్టులు ఆడి 906 పరుగులు చేశాడు. అందులో రెండు 2 శతకాలు, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. ఆ రెండు శతకాల్లో ఒకటి చెన్నైలో జరిగిన రెండో టెస్టులో 161 పరుగులు కాగా, రెండోది ఓవల్‌లో జరిగిన టెస్టులో 127 పరుగులు చేశాడు.
ఇక అశ్విన్ ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఒక్క టెస్టూ ఆడకపోయినా టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు (54) తీశాడు. అశ్విన్ ఆడింది 9 టెస్టులే కావడం మరో విశేషం. దీంతో వీరిద్దరూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇకముందు కూడా ఇలాగే రాణిస్తూ మరింత మెరవాలని అభిమానులు కోరుకుంటున్నారు.