Rohit Kohli Partnership: రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ.. టీమ్ఇండియా టాప్ బ్యాటర్లు అయిన వీరు క్రీజులో కలిసి ఆడుతుంటే అభిమానులకు చూసేందుకు రెండుకళ్లు సరిపోవు. పుల్‌షాట్లు, సిక్సర్లతో హిట్‌మ్యాన్ పరుగులు చేస్తే.. చూడచక్కని కవర్ డ్రైవ్స్‌తో బంతిని బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం విరాట్ శైలి. ఇప్పుడు ఈ జోడీ దిగ్గజ ఆటగాళ్లు సచిన్- గంగూలీ రికార్డుకు చేరువలో ఉంది. ఈ ద్వయం మరో 94 పరుగులు చేస్తే 5వేల పరుగులు చేసిన జోడీల జాబితాలో చేరుతుంది.
ప్రస్తుతం రోహిత్-కోహ్లీ ద్వయం 4,906 పరుగులు చేసింది. 81 ఇన్నింగ్స్‌లో 64.55 సగటుతో ఈ పరుగులు చేశారు. వీటిలో 18 సార్లు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరికొన్ని పరుగులు చేస్తే ఎలైట్ లిస్ట్‌లో చేరుతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటింగ్ ద్వయంగా రికార్డు సృష్టిస్తారు.
మరిన్ని రికార్డులు..
విండీతో సిరీస్ నేపథ్యంలో ఈ జోడీ మరో రికార్డు సాధించే అవకాశం ఉంది. ఇప్పటివరకు కరీబియన్ల జట్టుపై ఈ జోడీ 982 పరుగులు చేసింది. మరో 78 పరుగలు చేస్తే ఆ జట్టుపై 1000 పరుగులు సాధించిన భారత తొలి జోడీగా నిలుస్తుంది. సచిన్-గంగూలీ జోడీ నెలకొల్పిన రికార్డుల సరసన చేరుతారు.