T20 World Cup: టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీకి బీసీసీఐ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం నలుగురు ఫాస్ట్ బౌలర్లు జట్టులో కొనసాగనున్నారు. అయితే తుది జట్టులో మరొక ఆటగాడి స్థానంపై టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప సందేహం వ్యక్తం చేశాడు. భువనేశ్వర్‌కుమార్, హర్షల్ పటేల్‌లో ఎవరో ఒక్కరే తుది జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టోర్నీ ముంగిట టీమ్‌ఇండియా సన్నద్ధతపై అతడు స్పందించాడు.
"జట్టులో ఇప్పటికే హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హర్ష్‌దీప్ సింగ్, షమీలు రాణిస్తారు. కానీ భువనేశ్వర్‌కుమార్, హర్షల్ పటేల్ మధ్య పోటీవుంది. రానున్న రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో వీరదిద్దరూ ఎలా ఆడతారనేది చాలా కీలకం కానుంది. తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఈ ఫలితంపైనే ఆధారపడి ఉంది" అని రాబిన్ తెలిపాడు. ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 23న భారత్ తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతకుముందే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో టీమ్ఇండియా రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది. ఈ నెల 17, 19 తేదీలలో జరగనున్న ఈ మ్యాచులు జట్టులోని యువ ఆటగాళ్లకు మరింత కీలకం కానున్నాయి.