ఫుట్‌బాల్‌లో బంతిని అద్భుతంగా డ్రిబిల్ చేయగల సత్తా అతికొద్ది ఆటగాళ్లలోనే ఉంటుంది. ఇటలీ ఆటగాడు రాబర్టో బాగియో ఆ కోవకు చెందిన ప్లేయరే..! ఆడుతున్న తొలి ప్రపంచకప్‌లోనే అద్భుతమైన గోల్ చేశాడు. ప్రపంచకప్‌ల చరిత్రలోనే కళ్లుచెదిరే గోల్స్‌పై ఫిఫా నిర్వహించిన ఓ పోల్‌లో బాగియో గోల్ 7వ స్థానంలో నిలిచింది. రాబర్టోను ఇటలీ జట్టులో 'ది డివైన్ పోనీటెయిల్' అని పిలుస్తారు. మైదానంలోకి దిగితే అతడు ప్రత్యర్థులను బురిడీ కొట్టిస్తూనే ఉంటాడు.
1990లో ఇటలీ ప్రపంచకప్ మ్యాచ్‌లకు వేదికైంది. రాబర్టో బాగియో ఈ టోర్నిలో సబ్‌స్టిట్యూట్‌గా ఆడాడు. గ్రూప్ స్థాయిలో చివరి మ్యాచ్‌లో చెకోస్లొవాకియాతో తలపడింది. అప్పటికే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించి గ్రూప్‌లో తొలి స్థానంలో ఉంది. చెకోస్లోవాకియాతో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ 1-0 ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ ముగియడానికి 10 నిమిషాల ముందు బంతి రాబర్టో ఆధీనంలోకి వచ్చింది. అక్కడి నుంచి దాదాపు ముగ్గురు చెకోస్లోవాకియా ఆటగాళ్లు అతడిని వెంబడించారు. వారి నుంచి తప్పించుకొంటూ గోల్ పోస్టు సమీపానికి చేరుకొనే సరికి మొత్తం నలుగురు ఆటగాళ్ల చుట్టుముట్టారు. వారిని తప్పించుకొంటూ బంతిని అద్భుతమైన షాట్‌తో గోల్ పోస్టులోకి పంపాడు. ఆ మ్యాచ్‌ను ఇటలీ గెలుచుకొంది.