Rishabh Panth: బౌలర్లను మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఎదురు దాడి చేశానని పంత్ వెల్లడించాడు. ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులతో అతను టీమ్‌ఇండియాను ఆదుకున్నాడు. "ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఓ బౌలర్ ఉత్తమంగా బౌలింగ్ చేస్తున్నాడంటే.. అతని లయను దెబ్బతీయడం చాలా ముఖ్యం. నేనూ అదే అనుకున్నా. ఒకేలా కాకుండా విభిన్న షాట్లు ప్రయత్నిస్తూ బ్యాటింగ్ చేస్తా. కొన్ని సార్లు ముందుకు వచ్చి, మరికొన్ని సార్లు బ్యాక్‌ఫుట్‌పై.. ఇలా క్రీజును వాడుకుంటా. ఇదంతా బౌలర్‌ను మానసికంగా దెబ్బతీయడంలో భాగమే. ఇదేదో ముందస్తు ప్రణాళిక కాదు." అని పంత్ తెలిపాడు.
"బౌలర్లు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారోననే దానిపై దృష్టి సారించా. ఆరంభంలోనే వికెట్లు పడ్డప్పుడు కుదురుకునేందుకు సమయం తీసుకోవాలి. జడేజాతో భాగస్వామ్యం నమోదు చేసేందుకు ప్రయత్నించా. టీ విరామం కంటే ముందు మరో వికెట్ కోల్పోకూడదనుకున్నాం. ఇతర విషయాల గురించి ఆలోచించకుండా బంతిపై దృష్టి పెట్టమని కోచ్ ద్రవిడ్ చెప్పాడు. మొదట్లో ఒత్తిడిగా అనిపించినా ప్రక్రియపైనే ధ్యాస పెట్టా. ప్రత్యర్థి ఏం ఆలోచిస్తుందోనని కాకుండా ఓ ఆటగాడిగా నేనేం చేయగలనో అది చేశా"
-- రిషభ్ పంత్