టీమ్ఇండియా ప్లేయర్ రిషబ్ పంత్‌ను వన్డే జట్టు నుంచి విడుదల చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పంత్‌కు గాయమైందా..? లేదా మరేదైనా కారణమా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. క్రమశిక్షణా చర్యలు ఏమైనా తీసుకున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.
పంత్‌ను విడుదల చేస్తూ.. "బీసీసీఐ వైద్య బృందంతో సంప్రదింపుల తర్వాత వన్డే జట్టు నుంచి పంత్‌ను విడుదల చేశారు. టెస్టు సిరీస్‌కు అతడు తిరిగి జట్టుతో చేరతాడు" అని బోర్డు పేర్కొంది. ఈ మేరకు.. వన్డే సిరీస్ నుంచి తనను రిలీజ్ చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ను పంత్ కోరాడని సమాచారం. ఈ విషయం గురించి పంత్.. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చర్చించాడని తెలుస్తోంది. పంత్ ఇలా అడగడానికి కచ్చితమైన కారణమేంటో బీసీసీఐ చెప్పలేదు. కానీ, క్రమశిక్షణా చర్యలు మాత్రం కాదని తెలుస్తోంది.
అయితే రిషబ్ పంత్ విడుదలపై టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ స్పందించాడు. "నిజం చెప్పాలంటే.. నాకు కూడా పంత్ విషయం పూర్తిగా తెలియదు. ఆతడిని విడుదల చేస్తున్న విషయం నాకు డ్రెస్సింగ్ రూమ్‌లోనే తెలిసింది. కానీ దానికి కారణం ఎంటో నాకు తెలియదు. బహుశా.. ఈ ప్రశ్నకు మెడికల్ టీమ్ వద్ద సమాధానం దొరుకుతుందేమో" అని చెప్పుకొచ్చాడు.