కారు ప్రమాదంలో గాయపడి ముంబయిలో చికిత్స పొందుతున్న టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురైన తర్వాత తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐకి, అభిమానులకు, వైద్యులకు, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. కారు ప్రమాదానికి గురైన తర్వాత రిషభ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇదే తొలిసారి.
యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ట్వీట్ చేసిన పంత్.. ఏమన్నాడంటే? - బీసీసీఐకి రిషభ్ పంత్ కృతజ్ఞతలు
ఘోర రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషభ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ఈ సందర్భంగా ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలో మొదటిసారి సోషల్ మీడియాలో స్పందించాడు. తాను కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు పంత్.
"నాకు మద్దతుగా నిలిచిన అభిమానులు, సహచర ఆటగాళ్లు, వైద్యులు, ఫిజియోలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరినీ మైదానంలో చూడాలని ఎదురుచూస్తున్నాను. నా శస్త్రచికిత్స విజయవంతమైందని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ప్రస్తుతం కోలుకుంటున్నాను. రాబోయే సవాళ్లకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. నా వెన్నంటే ఉన్న బీసీసీఐకి, జై షాకు, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను ఆస్పత్రికి తరలించడంలో సహాయపడిన రజత్ కుమార్, నిషు కుమార్‌లకు ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను" అని పంత్ ట్వీట్ చేశాడు.
పంత్ మోకాలి లిగ్మెంట్‌కు శస్త్రచికిత్స చేశారు. అతడు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కనీసం ఆరు నెలలు సమయం పట్టే అవకాశముంది. దీంతో ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 15 సీజన్‌కు పంత్ అందుబాటులో ఉండట్లేదు. ఈ ఏడాది జరిగే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లకు కూడా రిషభ్ అందుబాటులో ఉండేది అనుమానంగానే కనిపిస్తోంది. పంత్ వేగంగా కోలుకొని వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.