Rinku Singh Ireland Series : ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి..తన తొలి ఇన్నింగ్స్‌లోనే అదరగొట్టాడు టీమ్ఇండియా బ్యాటర్ రింకూ సింగ్. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20తోనే అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ.. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ రెండో టీ20లో మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని అందిపుచ్చుకుని చెలరేగిపోయాడు. స్టేడియం దద్దరిల్లేలా సిక్సర్లను బాదాడు.
Rinku Singh Player Of The Match : ఐదో స్ధానంలో రంగంలోకి దిగిన రింకూ.. ఆడిన 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి భారత్‌కు మంచి స్కోర్‌ను అందించాడు. ఆఖరిలో శివమ్ దుబేతో కలిసి ఐర్లాండ్ బౌలర్లను చిత్తు చేశాడు. దీంతో ఈ యంగ్ ప్లేయర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమ్ఇండియాకు కొత్త ఫినిషర్ దొరికాడంటూ నెట్టింట అభిమానులు రింకూను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇంతటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన రింకునే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన అతను.. ఐపీఎల్‌లో ఉన్న అనుభవంతోనే ఇంత బాగా ఆడగలిగానని చెప్పుకొచ్చాడు.
'నేను సాధ్యమైనంత వరకు క్రీజులోనే ఉండాలని అనుకున్నాను. పదేళ్లుగా క్రికెట్ ఆడుతుంటే.. ఇప్పుడే దానికి తగిన ప్రతిఫలం దక్కినట్లు ఫీల్ అవుతున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌లో నేను బ్యాటింగ్ చేసిన మొదటి మ్యాచ్‌లోనే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది' అని రింకు చెప్పుకొచ్చాడు.