Rinku Singh 5 Sixes : ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్.. చివరఓవర్లో కొట్టిన ఐదు సిక్సులు.. ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేం. ఐపీఎల్‌లో అదరగొట్టి ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన రింకూ సింగ్.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో 20లో సత్తా చాటాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 38 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
Rinku Singh T20 Debut : అయితే ఈ మ్యాచ్ తర్వాత.. బ్యాటర్ రింకూ సింగ్‌ను భారత స్పిన్నర్ రవిబిష్ణోయ్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాదిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ ఐదు సిక్స్‌లు తన జీవితాన్ని మార్చేశాయని రింకూ సింగ్ తెలిపాడు.
"మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ నాకు అవకాశం రాలేదు. రెండో టీ20లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీలయ్యా. ఐపీఎల్‌లో ఆడినట్లుగానే చివరి వరకు ఆడాలని అనుకున్నాను. ప్రశాంతంగా ఉంటూ చివరి 2-3 ఓవర్లు హిట్టింగ్ చేయాలని ప్రణాళిక వేసుకున్నా. ఐదు సిక్సర్లు (ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై) నా జీవితాన్ని మార్చేశాయి. ఆ ఇన్నింగ్స్ నుంచే నాకు గుర్తింపు వచ్చింది. అభిమానులు స్టాండ్స్ నుంచి రింకూ.. రింకూ అని ఉత్సాహపరచడాన్ని ఇష్టపడతా" అంటూ రింకూ చెప్పుకొచ్చాడు.
ఇబ్బంది పడ్డ సిక్సర్ల కింగ్!..
IND Vs IRE T20 Rinku Singh : డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 అనంతరం కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తన చర్యతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ ఆటగాడు రింకూ సింగ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోస్ట్‌మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సమయంలో రింకూ ఇంగ్లీష్‌లో మాట్లాడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. హిందీలో మాట్లాడితే ఫ్రీగా ఉంటుందని రింకూ ప్రెజెంటర్ అలాన్ విల్కిన్స్‌కు చెప్పాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న బుమ్రా ముందుకు వచ్చి రింకుకు ట్రాన్స్‌లేటర్‌గా మారాడు. విల్కిన్స్ ఇంగ్లీష్‌లో అడుగుతుంటే బుమ్రా దాన్ని హిందీలోకి అనువాదం చేసి రింకుకు అర్దమయ్యేలా చెప్పుకొచ్చాడు. తన మంచిమనసు చాటుకున్న బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ సిరీస్‌లో చివరి టీ20 డబ్లిన్ వేదికగా ఆగస్టు 23న జరగనుంది.