ఈ ఏడాది ఐపీఎల్‌ను మధ్యలోనే రద్దు చేయడం సరైన నిర్ణయమేనని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. బయో బుడగలో అతిక్రమణలు జరగడమే ఇందుకు కారణమని అతడు పేర్కొన్నాడు.
"భారత్‌లో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం గుండెల్ని పిండేసింది. ఐపీఎల్ టోర్నీ ఆడుతున్నప్పుడు ఆరంభంలో బయో బుడగలో అంతా సవ్యంగానే అనిపించింది. కానీ టోర్నీ గడుస్తున్న కొద్దీ బబుల్‌లో కొన్ని అతిక్రమణలు చోటు చేసుకోవడం వల్ల పరిస్థితి మారిపోయింది. పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇలాంటి స్థితిలో లీగ్‌ను కొనసాగించడం కష్టం. ఈ నేపథ్యంలో మధ్యలోనే టోర్నీని ఆపాలన్న నిర్ణయం సరైందే."