Riyan Parag Domestic Cricket : రియాన్ పరాగ్..ఐపీఎల్ ప్రియులకు ఈ పేరు సుపరిచితమే. ఒకానొక ఐపీఎల్ సీజన్లో బాగా ఆడి పేరు తెచ్చుకున్న ఈ అసోం ఆల్‌రౌండర్.. ఆ తర్వాత వరుస పరాభవాలతో ఢీలా పడ్డాడు. అలాంటి ఆటగాడు వరుసగా ఆరు అర్ధసెంచరీలు సాధిస్తే ఎలా ఉంటుంది. అందులోనూ టీ20 ఫార్మాట్లో ఇలాంటి ఘనతను సాధిస్తే ఎలా ఉంటుంది. తాజాగా పరాగ్ ఇదే చేసి చూపించాడు.
టీ20ల్లో వరుసగా మూడు అర్ధసెంచరీలు చేయడం కష్టం. అలాంటిది ఈ ఫార్మాట్లో నిలకడగా రాణించి 50 దాటాలంటే కొంచెం అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉంటుంది. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు అర్ధ సెంచరీలు చేసి.. 21 ఏళ్ల రియాన్ పరాగ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో పరాగ్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటిదాకా ఆడిన 7 ఇన్నింగ్స్‌ల్లో అతడు 440 పరుగులు చేశాడంటే అతని ఆటతీరును మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
9 మ్యాచ్‌లు.. 8 అర్ధసెంచరీలు..
ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 6 అర్ధసెంచరీలు చేసి రికార్డు సృష్టించడమే కాదు.. ఈ సీజన్‌లో దేవధర్ ట్రోఫీ, ముస్తాక్ అలీ టోర్నీల్లో కలిపి 9 దేశవాళీ మ్యాచ్‌ల్లో 8సార్లు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు పరాగ్. ఇందులో ఓ మెరుపు సెంచరీ కూడా ఉండటం విశేషం. 193 స్టైక్‌రేట్‌తో పరాగ్ పరుగులు చేస్తూ అందరిని అబ్బురపరిచాడు.
ఇక ముస్తాక్ అలీ టోర్నీలో వరుసగా చండీగఢ్, సర్వీసెస్, బిహార్, సిక్కిం హిమాచల్‌ప్రదేశ్‌పై అర్ధసెంచరీలు చేసి వీరేంద్ర సెహ్వాగ్, డెవోన్ కాన్వే, వార్నర్, మసకద్జ, కమ్రాన్ అక్మల్, బట్లర్ సరసన నిలిచిన రియాన్.. కేరళపై అజేయంగా 57 పరుగులు సాధించి తన ఖాతాలో ఈ సరికొత్త రికార్డును వేసుకున్నాడు. ప్రస్తుతం ముస్తాక్ అలీ టోర్నమెంట్లో అతడే టాప్ స్కోరర్ కావడం విశేషం. ఈ టోర్నీకి ముందు దేవధర్ ట్రోఫీలో కూడా తన జోరును ప్రదర్శించాడు. చెత్త షాట్లను పక్కనపెట్టి తెలివిగా ఆడడం మొదలుపెట్టిన ఈ కుర్రాడు.. ఆ తర్వాత పరుగుల వరద పారించాడు.