భారత క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విఫలమవుతుండడం వల్ల బోర్టులో ప్రక్షాళనకు బీసీసీఐ శ్రీకారం చుడుతోంది. తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా భారత క్రికెట్ బోర్టు అడుగులు వేస్తోందని సమాచారం. అందులో భాగంగా టీ20 ఫార్మాట్‌కు కొత్త కోచ్ సహా కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం టీమ్ఇండియాకు హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్‌పై వేటు వేసే అవకాశముంది. ఎందుకంటే ఇండియా 2007 నుంచి ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. దానికి తోడు ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. దీని కారణంగానే మార్పులు చేసే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోందని తెలుస్తోంది.
ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి వివరాలు వెల్లడించారని సమాచారం. "మేము ఈ విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నాము. ఇక్కడ రాహుల్ ద్రవిడ్ లేదా ఎవరి సామర్థ్యం మీద అనుమానం కాదు. టైట్ షెడ్యూల్‌లను నిర్వహించడం, బోర్డులో ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉండటం అనే దాని గురించి ప్రశ్న. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ అనేది ప్రత్యేక స్పోర్ట్, రెగులర్ ఈవెంట్స్ లాంటిది. దాని ప్రకారం మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. త్వరలో టీమ్ఇండియాకు కొత్త కోచ్ రాబోతున్నారు. త్వరలోనే కొత్త కెప్టెన్‌ను కూడా అనౌన్స్ చేస్తాం. ఆ తర్వాత కోచ్‌ను కూడా. అయితే ఇప్పటి వరకు ఏదీ ఫైనల్ కాలేదు" అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.