కెప్టెన్‌గా విఫలమయ్యాడనే విమర్శలపై పాకిస్థాన్ జట్టు సారధి బాబర్ అజామ్ స్పందించాడు. తాను ఎవరికీ తన కెప్టెన్సీ నిరూపించాల్సిన అవసరం లేదన్నాడు. తాను ఎలా జట్టును నడిపిస్తున్నాననేది అందరికీ తెలుసునని చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ ముందు.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధామిచ్చాడు.
రిపోర్టర్: గత సంవత్సరం నుంచి స్వదేశంలో జరుగుతున్న మ్యాచ్‌లలో మీరు పేలవ ప్రదర్శన కనబర్చారు. ఆ కారణంగా టీమ్ గెలవలేకపోయింది. దీనికి బాధ్యత వహిస్తూ టెస్ట్ కెప్టెన్‌గా వైదొలగడాన్ని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా?
బాబర్:నేను ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. నేను ఎలా జట్టును నడిపిస్తున్నాననేది అందరికీ తెలుసు. పాకిస్థాన్ కోసం మంచిగా ఆడాలి అనే దానిపైనే నా దృష్టి ఉంది. వైట్ బాల్ ఫార్మాట్‌లలో మేము మంచి ప్రదర్శన చేశాము. ఇక న్యూజిలాండ్‌పై మేము అదే దూకుడిని కొనసాగించాలనుకుంటున్నాము. అయినప్పటికీ వారిది కూడా ఎంతో బలమైన జట్టు అని మాకు తెలుసు. ఇది రెండు జట్లకు కఠినమైన సిరీస్.
రిపోర్టర్ : మీరు బ్యాటింగ్‌లో గొప్పగా రాణించే దశలో ఉన్నారు. అయితే సచిన్ తెందూల్కర్, బ్రియాన్ లారా, సయీద్ అన్వర్ వంటి ఆటగాళ్లు గొప్ప బ్యాటర్లు కానీ గొప్ప కెప్టెన్లు కాలేకపోయారు. సొంతగడ్డపై 8 ప్రయత్నాల్లో ఒక్క టెస్టు కూడా గెలవలేకపోయారు. మీరు టెస్ట్ కెప్టెన్సీని వదిలివేయాలని మీరు అనుకుంటున్నారా? తద్వారా ఆటలో గొప్ప బ్యాటర్ల సరసన ఒకరిగా నిలిచే అవకాశం మీకొస్తుంది?
బాబర్ : ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్‌లు ముగిశాయని నేను భావిస్తున్నాను. మేము ఇప్పుడు వన్డే సిరీస్‌ను ఆడబోతున్నాము. కాబట్టి దీనికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దాని గురించి అడగండి.
కాగా, ఆటగాళ్ల ఎంపికపై తాత్కాలిక చీఫ్ సెలెక్టర్ షాహిద్ అఫ్రిదీతో తనకు ఎలాంటి సమస్యలు లేవని బాబర్ స్పష్టం చేశాడు.
ఉపఖండ పరిస్థితుల్లో మా పద్ధతి అదే : విలియమ్సన్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తమ జట్టు ఏ విధానంతో ఆడాలనేది ముందుగా అనుకోలేదని.. అది పూర్తిగా అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ చెప్పాడు. తాము వైట్ బాల్ క్రికెట్‌లో ఓ పద్ధతిని అనుసరించామని.. ఇప్పుడు ఆ పద్ధతినే పాటించాలనుకుంటున్నామని చెప్పాడు. కానీ తమ ఆటగాళ్లలో కొంతమంది ఉపఖండ పరిస్థితులలో ఆడటం కొత్త అనుభవం.. కాబట్టి వారు మ్యాచ్ సమయంలో దానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని కేన్ చెప్పారు. జట్టుకు సరైన సమయంలో ప్రతి ఒక్కరూ పరుగులు చేయడం ముఖ్యం కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా ఆడతామని అన్నాడు.
ఈ వారంలో కరాచీ వేదికగా మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. జనవరి 9న మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీకి గాయం కారణంగా అతడు పాకిస్థాన్, భారత్‌తో జరిగే సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. మాట్ స్థానంలో ఎవరిని భర్తీ చేయాలన్న దానిపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్సన్ తెలిపాడు.