UAE T20 League: ఐపీఎల్లో ఇప్పటికే ఓ జట్టుకు యజమానిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్(reliance industries limited news) తమ క్రికెట్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో పడింది. రిలయన్స్ గ్రూప్స్‌లో ఒకటైన రిలయన్స్ స్ట్రాటెజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ ద్వారా మరో కొత్త ఫ్రాంఛైజీని సొంతం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.
యూఏఈ టీ20 లీగ్..
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సారథ్యంలో జరగనున్న యూఏఈ టీ20 లీగ్‌లో ఓ ఫ్రాంఛైజీని సొంతం చేసుకోనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. యూఏఈ టీ20 లీగ్ ఛైర్మన్, ఈసీబీ(emirates cricket board news) వైస్ ఛైర్మన్ ఖాలిద్ అల్ జరూనీ దీనిపై స్పష్టత ఇచ్చారు. తమ లీగ్‌లో రిలయన్స్ పెట్టుబడులు పెట్టనుందని పేర్కొన్నారు. ఆర్ఐఎల్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
"యూఏఈ టీ20 లీగ్ ద్వారా దుబాయ్‌లో క్రికెట్‌ను మరింత విస్తరించాలని చూస్తున్నాం. లీగ్‌లోని పలు ఫ్రాంఛైజీలు క్రికెట్‌ను అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా తరచూ నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ ప్రస్తుతం ఈ లీగ్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపడం సంతోషకరమైన విషయం." అని జరూనీ అన్నారు.