IND VS ENG Bumra record: టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు (రీషెడ్యూల్) రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇప్పటికే భారత పేసర్ బుమ్రా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే సిరీస్‌లో అత్యధిక వికెట్లు (21) తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు భువనేశ్వర్ కుమార్ 2014లో ఐదు టెస్టుల్లో 19 వికెట్లు తీశాడు. ఇప్పుడు భువీని బుమ్రా అధిగమించాడు. ఇదే క్రమంలో బుమ్రా మరో ఘనత సాధించాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) జట్లపై అక్కడి మైదానాల్లో వంద వికెట్లకుపైగా సాధించిన ఆరో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. బుమ్రా (101) కంటే ముందు అనిల్ కుంబ్లే (141), ఇషాంత్ శర్మ (130), జహీర్ ఖాన్ (119), మహమ్మద్ షమీ (119), కపిల్ దేవ్ (119) ఉన్నారు.
SENA జట్లలో ఇంగ్లాండ్‌పైనే బుమ్రా అత్యధికంగా 37 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ కేవలం 2.67 మాత్రమే కావడం విశేషం. అత్యుత్తమ బౌలింగ్ 5/64. అదే విధంగా ఆసీస్‌పై 32 వికెట్లు (అత్యుత్తమ బౌలింగ్ 6/33), దక్షిణాఫ్రికా జట్టుపై 26 వికెట్లు (అత్యుత్తమం 7/111), న్యూజిలాండ్ మీద రెండు టెస్టుల్లో ఆరు వికెట్లు (అత్యుత్తమం 3/62) తీశాడు. అదేవిధంగా వందకుపైగా వికెట్లు తీసిన ఐదో టీమ్‌ఇండియా పేసర్ కూడా బుమ్రానే.