తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కరోనా అంటే భయం లేదా.. బాధ్యతారాహిత్యమా?'.. క్రీడాకారుల తీరుపై విమర్శలు - రోహిత్ శర్మ న్యూస్​

క్రీడాకారులు ఫిట్‌నెస్‌తో పాటు కరోనా జాగ్రత్తలు కూడా పాటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అనేక మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ఇంగ్లాండ్​ పర్యటనలో ఉన్న భారత కెప్టెన్​ రోహిత్​శర్మ కరొనా బారినపడ్డాడు. ఈ నేపథ్యంలో క్రీడాకారులు అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు ఎదరవుతున్నాయి.

rohit sharma corona positive
rohit sharma corona positive

By

Published : Jun 26, 2022, 12:37 PM IST

రెండేళ్ల క్రితం కరోనా అంటే ప్రతిఒక్కరూ భయపడేవారు. ఎంతో ఫిట్‌నెస్‌ ఉండే క్రీడాకారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరోనా అంటే భయంలేకుండా పోయింది. అందరిలోనూ నిర్లక్ష్యం.. మాకేమవుతుందిలే అనే ఉదాసీనత అలవడింది. అది ఇప్పుడు టీమ్‌ఇండియా క్రికెటర్లకు కూడా పాకింది. అందువల్లే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారినపడినట్లు పలువురు అంటున్నారు.

అభిమానితో రోహిత్ శర్మ

రోహిత్‌ ఎందుకిలా..:ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియా ఒక టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అందుకోసం కాస్త ముందుగానే అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతానికి అతడికి ఒక్కడికే వైరస్‌ సోకిందని తెలుస్తుండగా రాబోయే రోజుల్లో మరెంత మంది ఆటగాళ్లకు పాజిటివ్‌గా తేలుతుందనేది చూడాలి. అయితే, ఇక్కడ రోహిత్‌కు పాజిటివ్‌గా తేలడానికి ప్రధాన కారణం .. వార్మప్‌ మ్యాచ్‌కు ముందు అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పర్యటనలో కచ్చితమైన బయోబబుల్‌ నిబంధనలు పాటించని నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు యథేచ్ఛగా బయటకు వెళ్లారు. మాస్కులు ధరించకుండానే అభిమానులతో ఫొటోలు దిగడం, షాపింగ్‌లకు వెళ్లడం లాంటివి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. మరోవైపు ఇంగ్లాండ్‌లో రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆటగాళ్లు జాగ్రత్తలు పాటించాల్సింది పోయి.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి.

మాస్క్​ లేకుండా రోడ్డుపై తిరుగుతున్న కోహ్లీ

ముందే హెచ్చరించాల్సింది..:అయితే, ఆటగాళ్లు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లడం, షాపింగ్‌లు చేయడం, బయట అభిమానులను కలవడంపై విమర్శలు రావడం వల్ల బీసీసీఐ హెచ్చరించింది. అనవసరంగా బయటకు వెళ్లరాదని, మాస్కులు ధరించాలని, బాధ్యతతో మెలగాలని సూచించింది. అదేదో ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ గడ్డపై అడుగుపెట్టినప్పుడే చేయాల్సిన పని అని.. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించాక ఇప్పుడు హెచ్చరిస్తే ఏం ప్రయోజనం అని అభిమానులు మండిపడుతున్నారు. వాస్తవానికి గతేడాది ఇంగ్లాండ్‌ పర్యటనలోనూ పలువురు ఆటగాళ్లు వైరస్‌ బారిన పడ్డారు. అప్పుడు న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు కచ్చితమైన బయోబబుల్‌ ఏర్పాటు చేసి మ్యాచ్‌ను పూర్తి చేశారు. తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు నెల రోజులకుపైగా విరామం దొరకడంతో ఆటగాళ్లను కొద్ది రోజులు బబుల్‌ నుంచి విడుదల చేశారు. దీంతో పలువురు క్రికెటర్లు ఇతర క్రీడా ఈవెంట్లకు హాజరయ్యారు. ఆ సమయంలో రిషభ్‌ పంత్ వైరస్‌ బారినపడ్డాడు. టెస్టు సిరీస్‌ ప్రారంభమయ్యేనాటికి అందరూ క్షేమంగా ఉన్నా.. మళ్లీ ఐదో టెస్టుకు ముందు పలు కేసులు నమోదయ్యాయి.

అభిమానితో కోహ్లీ

ఆ మాత్రం ఆలోచించరా..?:ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినా అది ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. వాక్సినేషన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావంతో ప్రాణనష్టం తగ్గినా ఇప్పటికి ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయితే.. కొందరు వైరస్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఉండే పలువురు క్రికెటర్లు కూడా ఏమాత్రం నిబంధనలు పాటించడం లేదు. క్రికెట్‌ అనేది ఆటగాళ్లంతా కలిసి ఆడే గేమ్‌. ఒక్క ఆటగాడికి వైరస్‌ సోకితే అది మిగతా వారికి కూడా వ్యాపించే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో గత అనుభవాల నుంచి కూడా టీమ్‌ఇండియా ఏమాత్రం నేర్చుకోలేదనే విషయం అర్థమవుతోంది. గతేడాది పూర్తికావాల్సిన ఐదో టెస్టు కరోనా కేసుల కారణంగానే వాయిదా పడింది. అలాంటిది ఇప్పుడు కూడా ఆటగాళ్లు ఇలా వైరస్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సిరీస్‌కు ముందు విరాట్‌ కోహ్లీ, అశ్విన్‌ కూడా వైరస్‌ బారినపడ్డారు.

అభిమానులతో విరాట్ కోహ్లీ

బయోబబుల్‌ హుష్‌కాకి..:కరోనా తొలి ఏడాది అన్ని రంగాల్లాగే క్రికెట్‌ కూడా కుదేలైంది. అంతర్జాతీయ స్థాయిలో మిగతా క్రీడల్లాగే క్రికెట్‌ టోర్నీలు సైతం రద్దయ్యాయి లేదా వాయిదా పడ్డాయి. తర్వాత నెమ్మదిగా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల బయోబబుల్‌ వంటి పకడ్బందీ ఏర్పాట్లతో వాటిని తిరిగి నిర్వహించడం మొదలెట్టారు. అప్పుడు ఆయా టోర్నీలు, సిరీస్‌ల్లో పాల్గొనే ఆటగాళ్లకు ముందే కరోనా పరీక్షలు చేయడం, వారిని కొద్ది రోజులు ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉంచడం.. ఆ తర్వాతే బబుల్‌లోకి పంపడం చేసేవారు. దీంతో ఎలాంటి కేసులు లేకుండా ఆ టోర్నీలు సజావుగా సాగేవి. కానీ, కొంత కాలంగా అంతర్జాతీయ మ్యాచ్‌లు యథావిధిగా సాగుతుండటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇతర లీగులు కూడా నిర్వహిస్తుండటంతో ఆటగాళ్లు చాలా రోజుల పాటు బయోబబుల్‌ల్లో గడపాల్సి వస్తోంది. దీంతో వారు మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున నిబంధనలను కాస్త సడలించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా ఆటగాళ్లకు అంత కఠినమైన నిబంధనలు లేవు. అందుకే రోహిత్‌ ఇలా వైరస్‌ బారినపడ్డాడనే విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా ఇంగ్లాండ్‌తో ఈ టెస్టు కీలకమైంది కాబట్టి ఆటగాళ్లు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదు. ఇకనైనా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం.

ఇదీ చదవండి:టీమ్​ ఇండియాకు షాక్​.. కెప్టెన్​ రోహిత్​ శర్మకు కరోనా

ABOUT THE AUTHOR

...view details