Umran Malik News: ఉమ్రాన్ మాలిక్.. ఇప్పుడు దేశమంతా మారుమోగుతున్న పేరు. ఈ ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ జమ్ముకశ్మీర్ యువ కెరటం. మెరుపు వేగంతో బంతులేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించాడు. ఇతడి బౌలింగ్ ప్రదర్శన చూసి సెలక్టర్లు కూడా దాసోహం అయ్యారు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు టీమ్ ఇండియా జట్టులో చోటు కల్పించారు. అయితే ఈ విషయం తెలిసినప్పుడు ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్.. కశ్మీర్ షాహిదీ చౌక్‌లోని తన దుకాణంలో కూరగాయలు, పండ్లు విక్రయిస్తున్నారు.
Umran Malik Team India: ఉమ్రాన్ అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వాహించబోతున్నాడని తెలిసి అతని చుట్టుపక్కల వాళ్లందరూ సంబరాలు చేసుకున్నారు. ఉమ్రాన్ తండ్రి రషీద్ మాత్రం ఎంతో ప్రశాంతంగా తన దుకాణానికి వచ్చే కస్టమర్లకు, స్నేహితులకు మిఠాయిలు పంచారు. ఆయనను పలకరించేందుకు వెళ్లిన ఈటీవీ భారత్ ప్రతినిధులకు కూడా స్వీట్లు ఇచ్చి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం తన కుమారుడి గురించి వివరించారు.
ఉమ్రాన్ మాలిక్ తనలా షాపులో కూరగాయలు, పండ్లు అమ్మాలని ఏనాడూ కోరుకోలేదని తండ్రి రషీద్ చెప్పారు. అందుకే ఉమ్రాన్ తన స్నేహితులతో క్రికెట్ ఆడుతుంటే ఏనాడూ అడ్డు చెప్పలేదని పేర్కొన్నారు.