మార్చిలో జరగనున్న మహిళల ప్రీమియర్ లీగ్-2023 కోసం తమ జట్టును పటిష్ఠంగా తీర్చి దిద్దేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ సన్నాహాలు చేస్తోంది. తమ టీమ్‌కు దిశా నిర్దేశం చేసేందుకు భారత టెన్నిస్ దిగ్గజాన్ని రంగంలోకి దించింది. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఆర్సీబీ మెంటార్‌గా నియమించినట్లు బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తమ మహిళా జట్టుకు మార్గదర్శనం చేసేందుకు ఇంతకంటే గొప్ప వ్యక్తి మరొకరు దొరకరంటూ సానియాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది ఫ్రాంఛైజీ .
క్రికెట్లోకి సానియా మీర్జా.. ఉమెన్ లీగ్లో అరంగేట్రం - సానియా మీర్జా కెరీర్
మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మెంటార్‌గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఎంపికయ్యారు. ఈ వార్తను ఆర్సీబీ తన ట్విట్టర్ వేదిక ద్వారా తెలియజేసింది.
"మా కోచింగ్ సిబ్బంది క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుంది. అయితే, కఠిన పరిస్థితులు, ఒత్తిడిని అధిగమించేందుకు మా మహిళా క్రికెటర్లకు సరైన మార్గదర్శి ఉండాలని భావించాం. ఛాంపియన్ అథ్లెట్, అవరోధాలు అధిగమించి దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగిన వ్యక్తిని మా మెంటార్‌గా నియమించాం. మా కుటుంబంలోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం సానియా మీర్జా" అంటూ ఆర్సీబీ లేటెస్ట్ తన ట్వీట్లో పేర్కొంది. ఆర్సీబీ తీసుకున్నఈ నిర్ణయంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెంటార్‌గా సరైన వ్యక్తిని ఎన్నుకున్నారంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో తాను కెరీర్‌ను ముగించనున్నట్లు సానియా మీర్జా ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి జట్టు:
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సారథ్యం వహించనున్న ఈ టీమ్‌లో సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిషా కసత్, ఇంద్రాణీ రాయ్, శ్రేయాంక పాటిల్, కణకా అహూజా, ఆశా శోభన, హెతర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెమ్నార్, కోమల్ జంజాద్, మేగన్ షూట్, సహానా పవార్లు ఉన్నారు.