టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రిపై ప్రశంసలు కురిపించాడు భారత మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్. యువకులలో ఆత్మవిశ్వాసం నింపడంలో అతడిని మించిన వారు లేరని తెలిపాడు. యువ క్రికెటర్లను తీర్చి దిద్దడంలో అతడి ప్రతిభ నమ్మశక్యంగా లేదని పేర్కొన్నాడు. '1971: ది బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెటింగ్ గ్రేట్నెస్' పుస్తకావిష్కరణ వర్చువల్ సమావేశంలో గావస్కర్ పాల్గొన్నాడు.
"ప్రాక్టీస్ సెషన్ తర్వాత ఓ 10-15 నిమిషాలు రవిశాస్త్రి యువ క్రికెటర్లతో మాట్లాడితే చాలు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది నమ్మశక్యంగా లేదు. ఒక్కసారి యువకుల సామర్థ్యాలను, ప్రతిభను రవి గుర్తించాడంటే చాలు.. వారిని ప్రోత్సాహించడానికి అతడిని మించిన వ్యక్తి లేడు. ఏమి చేస్తే వారిలో మార్పు వస్తుందో చెప్తాడు" అని రవిశాస్త్రిని.. గావస్కర్ పొగడ్తలతో ముంచెత్తాడు.