తెలంగాణ

telangana

ETV Bharat / sports

మంజ్రేకర్‌ కోసం కామెంట్రీ బాక్స్‌ వెతికాను: జడేజా

2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో కమెంట్రీ బాక్స్ ఎక్కడుందా అని వెతికినట్లు టీమ్​ఇండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. వ్యాఖ్యాత ముంజ్రేకర్​ కోసం వెతికినట్లు స్పష్టం చేశాడు.

jaddu munjrekar
జడేజా, ముంజ్రేకర్

By

Published : May 31, 2021, 5:43 AM IST

2019 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా న్యూజిలాండ్‌తో తలపడిన సెమీఫైనల్స్‌లో తాను అర్ధశతకం సాధించాక కామెంట్రీ బాక్స్‌ ఎక్కడుందా అని వెతికానని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అన్నాడు. అంతకుముందు క్రికెట్‌ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అతడిని 'బిట్స్‌ అండ్‌ పీసెస్‌' లాంటి క్రికెటర్‌ అని సంబోధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జడేజా సైతం అప్పుడే ట్విటర్‌లో ఓ పోస్టు చేసి తనదైన శైలిలో స్పందించాడు. మంజ్రేకర్‌ను తన మాటలతోనే నోరు మూయించాడు. అయితే, తాజాగా ఆ సంఘటనపై స్పందించిన జడేజా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయం వెల్లడించాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో జడేజా(77; 59 బంతుల్లో 4x4, 4x6) ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేశాడు. ధోనీ(50; 72 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి ఏడో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న జడేజా వెంటనే తన బ్యాట్‌ను పైకెత్తి కత్తి తిప్పినట్లు తిప్పి సంబరాలు చేసుకున్నాడు. అయితే, ఆ సమయంలో తాను మైదానంలో ఉన్న కామెంట్రీ బాక్స్‌ కోసం ఎక్కడుందా అని వెతికానని ఇంటర్వ్యూలో చెప్పాడు. అది అక్కడే ఎక్కడో ఉంటుందని భావించానని, ఆ సమయంలో తాను ఎవరికోసం బ్యాట్‌ను తిప్పానో అర్థం చేసుకునే వారికి తెలుస్తుందని జడేజా పేర్కొన్నాడు.

ఇక ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 239/8 పరుగులు చేసి టీమ్‌ఇండియా ముందు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఛేదనలో భారత టాప్‌ ఆర్డర్‌ పేకమేడలా కూలింది. కేఎల్‌ రాహుల్‌(1), రోహిత్‌ శర్మ(1), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(1) పూర్తిగా విఫలమయ్యారు. ఆపై పంత్‌(32), దినేశ్‌ కార్తీక్‌(6), హార్దిక్‌ పాండ్య(32) సైతం వికెట్లు కాపాడుకోలేకపోయారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. అనంతరం జడేజా, ధోనీ శతక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను గెలిపించేలా విశ్వప్రయత్నం చేశారు. జడేజా ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కానీ, చివర్లో అనూహ్యంగా పుంజుకున్న కివీస్‌ వారిద్దర్నీ ఔట్‌ చేసి విజయం ఖాయం చేసుకుంది. చివరికి భారత్‌ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో జడేజా బ్యాటింగ్‌ను ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు.

ఇదీ చదవండి:ఆసియా ఛాంపియన్​షిప్​లో​ మేరీకోమ్​కు రజతం

ABOUT THE AUTHOR

...view details