Ravindra Jadeja ODI World Cup 2023 :టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సార్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం జరుగుతోన్న ప్రపంచకప్‌లోనూ అతడు విజృంభిస్తున్నాడు. మెదానంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పుడు.. కచ్చితత్వంతో కూడిన బౌలింగ్‌తో జడేజా ఎలా ఆడతాడో తెలిసిందే. అదే పిచ్ కాస్త తనకు అనుకూలించిందా.. అంతే ఇక టీమ్‌కు ప్రమాదకర అస్త్రంగా మారిపోతాడు. ఇప్పుడు జరుగుతోన్న వరల్డ్ కప్‌లో.. తన స్పిన్‌తో జట్టుకు అత్యంత కీలకంగా అవుతున్నాడు.
ముఖ్యంగా మధ్య ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తున్నాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం టోర్నీలో అతడి గణాంకాలు అద్భుతంగా ఏమీ లేవు.. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఏడు వికెట్లను తీశాడు. కానీ మిడిల్ ఓవర్లలో మాత్రం కట్టుదిట్టంగా బంతులు సంధిస్తూ.. ప్రత్యర్థి పరుగుల వేగానికి బ్రేకులు వేస్తున్నాడు. ఇన్నింగ్స్ గమనాన్ని మార్చేస్తున్నాడు. బ్యాటర్లకు బ్రేకులు వేసే అతడి కచ్చితత్వమే.. మరోవైపు నుంచి కుల్‌దీప్ యాదవ్ మరింతగా బాగా ఎటాక్ చేయడానికి వీలు కల్పిస్తోంది.
Ravindra Jadeja Dot Balls : మొత్తం 131 డాట్ బాల్స్.. ఈ వరల్డ్ కప్‌లో జడ్డూ చాలా మెరుగ్గా బంతులు సంధిస్తున్నాడు. నాలుగు మ్యాచుల్లో కలిపి 37.5 ఓవర్లు బౌలింగ్ చేసి.. ఏకంగా 131 డాట్ బాల్స్ వేశాడు. మొత్తం 21.5 ఓవర్ల డాట్ బాల్స్‌ను సంధించాడు. అతడి డాట్ బాల్స్ శాతం 58.22గా ఉంది. బౌండరీ బాల్స్ 11 మాత్రమే ఉన్నాయి. అందులో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు. దీని ఆధారంగా అతడు.. బ్యాటర్లకు ఎలా కళ్లెం వేస్తున్నాడో, పరుగుల వేగాన్ని ఎలా నియంత్రిస్తున్నాడో చెప్పొచ్చు.