భారత జట్టులో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అత్యంత విలువైన ఆటగాడని పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా (Danish Kaneria) అన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో అతడు అత్యంత కీలకం అవుతాడని చెప్పాడు. కీలక సమయాల్లో వికెట్లు తీయగల, పరుగులు చేయగల సామర్థ్యం అతడికి ఉందని ప్రశంసించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final)కు ముందు కనేరియా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు.
"ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బౌలర్లు కీలకపాత్ర పోషిస్తారు. వాళ్లు వికెట్లు తీస్తేనే మనం మ్యాచ్‌లు గెలవగలం. ఇక రవీంద్ర జడేజా గురించి చెప్పాలంటే అతడో 3డీ ఆటగాడు. అలాంటి క్రికెటర్‌ను పక్కన పెట్టేయడం సులభం కాదు. అతడు కచ్చితంగా ఆడాల్సిందే. జడ్డూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తాడు. లోయర్ ఆర్డర్‌లో పరుగులు చేస్తాడు. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతాడు. ఇక మెరుపు ఫీల్డింగ్‌తో ఒకట్రెండు రనౌట్లు చేయగలడు. అందుకే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్‌లో అతడే అత్యంత విలువైన ఆటగాడు."