Ravindra Jadeja CSK: ఐపీఎల్ 2022 నిర్వహణ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12, 13న మెగా వేలం ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. ధోనీ సారథ్యంలో ఇప్పటికే నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది సీఎస్కే. అయితే.. ఈ ఏడాది ధోనీ కెప్టెన్‌గా కొనసాగుతాడా? లేదా? అన్న అంశంపై కొంతకాలం నుంచి సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో చెన్నై యాజమాన్యం ధోనీ స్థానంలో జడేజాకు కెప్టెన్ పగ్గాలు అప్పగించనుందనే వార్తలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. గతంలో పలువురు మాజీలు కూడా సీఎస్కేను నడిపించే సామర్థ్యం ఉన్న ఆటగాడు జడేజానే అని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే పలు ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. సీఎస్కే యాజమాన్యం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (రూ.16 కోట్లు), ధోనీ (12 కోట్లు), మొయీన్ అలీ (రూ.8 కోట్లు), రుతురాజ్ (రూ. 6 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ఈ నిర్ణయం ద్వారా యాజమాన్యం కూడా ధోని తర్వాతి కెప్టెన్ ఎవరో చెప్పకనే చెప్పినట్లయింది!
మరోవైపు, ధోనీ ఎంతకాలం సీఎస్కే తరఫున ప్రాతినిధ్యం వహిస్తాడన్న విషయంపై పూర్తిగా స్పష్టత లేదు. కానీ, ఓ సందర్భంలో ధోనీ మాట్లాడుతూ.. తన చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ వేదికగా ఆడుతానని పేర్కొన్నాడు.
ఇప్పటివరకు జడేజా 200 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా.. 2386 పరుగులు చేశాడు. 127 వికెట్లు పడగొట్టాడు. ఫీల్డర్‌గా గొప్పగా రాణించాడు.