రవిచంద్రన్ అశ్విన్.. భారత క్రికెట్ జట్టులో సీనియర్ బౌలర్. టీమ్ఇండియాకు అవసరమైనప్పుడు బ్యాటర్ అవతారమూ ఎత్తుతుంటాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఓటమి తప్పదనుకున్న సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్.. తన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్(29*)తో కలిసి.. అద్భుతంగా 71 పరుగుల భాగస్వామ్యం నిర్మించి భారత్‌కు విజయాన్ని అందించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా.. 9వ బ్యాటర్‌గా వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా అశ్విన్(42 నాటౌట్) రికార్డు సృష్టించాడు. గతంలోనూ ఇలా అశ్విన్.. తనదైన శైలి బ్యాటింగ్‌తో భారత్‌ను ఆదుకున్నాడు. 2021లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన మూడో టెస్టులో జట్టును ఓటమి నుంచి కాపాడాడు. ఆ మ్యాచ్‌లో 7వ స్థానంలో దిగిన అశ్విన్(39*:128 బంతులు), విహారి(23*:161 బంతులు)తో కలిసి దాదాపు 44 ఓవర్లు క్రీజులో పాతుకుపోయాడు. ఆసీస్‌తో ఆ మ్యాచ్ డ్రా అవడం, ఆ తర్వాతి టెస్టులో గెలవడంతో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది.
బ్యాటింగైనా బౌలింగైనా 'దేనికైనా రెడీ'.. అశ్విన్‌తో మామూలుగా ఉండదు మరి.. - ఇండియా బంగ్లా టెస్టు సిరీస్
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియాను గట్టెక్కించారు రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్. కఠినమైన పరిస్థితుల్లో బంగ్లా బౌలర్ల దాడిని తట్టుకుని భారత్ ఓడిపోకుండా కాపాడారు. 2-0తో టెస్టు సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టు నవ్వులతో పర్యటనను ముగించింది.
నిజానికి అశ్విన్ కెరీర్ బ్యాటర్‌గానే మొదలైంది. తమిళనాడు తరఫున దేశీ క్రికెట్ ఆడే సమయంలో అశ్విన్ ఓపెనింగ్ బ్యాటర్ కమ్ మీడియం పేస్ బౌలర్‌గా ఉండేవాడు. తన కోచ్ సీకే విజయ్ సూచనతో ఆఫ్ స్పిన్నర్‌గా మారాడు. అక్కడి నుంచి అశ్విన్ దశ మారింది. దేశీయ క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టులోకి వచ్చాడు. టీమ్ఇండియా సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అశ్విన్ మొత్తంగా 88 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి..449 వికెట్లు పడగొట్టాడు. 3043 పరుగులు చేశాడు. అతి తక్కువ మ్యాచ్‌లలో 400 వికెట్లు, 3 వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఘనత సాధించాడు.