Ravichandran Ashwin international career: టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ కీలకమైన బౌలర్. తన స్పిన్ మాయజాలంతో ఎన్నో మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియాకు విజయాలనందించాడు. 35 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్నర్ టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు (429) తీసిన 3వ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, కొన్నాళ్ల క్రితం తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి అశ్విన్ తాజాగా బయటపెట్టాడు. తన పని అయిపోయిందని అప్పట్లో చాలామంది హేళన చేశారని పేర్కొన్నాడు. చెన్నైకు వెళ్లి క్లబ్ గేమ్స్ ఆడినప్పుడల్లా, తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిందని ప్రజలు మాట్లాడుకోవడం ప్రత్యక్షంగా విన్నానని అశ్విన్ వెల్లడించాడు.
"ఒక క్రీడాకారుడిగా చెబుతున్నా.. మనపై ఎన్నో విమర్శలు వస్తాయి. వాటిని పట్టించుకోవద్దు. నన్ను కూడా చాలామంది విమర్శించారు. బౌలర్‌గా మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు నేను చెన్నైలో క్లబ్ గేమ్‌లు ఆడేందుకు వెళ్లేవాడిని. అప్పుడు నా గురించి చాలామంది గుసగుసలాడేవారు. 'అశ్విన్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. అందుకే ఇక్కడి వచ్చి ఆడుతున్నాడు' అని ప్రజలు మాట్లాడుకోవడం విన్నాను. ఇలా చాలాసార్లు జరిగింది. ఇలా జరిగినప్పుడు కొన్నిసార్లు తేలికగా తీసుకుని నవ్వాను. మరి కొన్నిసార్లు బాధ కలిగింది" అని అశ్విన్ బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా షోలో అన్నాడు.