భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీతో(Virat Kohli Captaincy) కోచ్ అనిల్ కుంబ్లేకు అభిప్రాయబేధాలు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ చేతిలో ఓటమి. కోహ్లీ సేనపై తీవ్ర విమర్శలు, కోచ్ పదవి నుంచి వైదొలిగిన కుంబ్లే. 2017 జులైలో భారత క్రికెట్ జట్టు పరిస్ధితి ఇది. అలాంటి గడ్డు పరిస్ధితుల్లో టీమ్ఇండియా కోచ్ బాధ్యతలు స్వీకరించాడు రవిశాస్త్రి(Ravi Shastri as Coach). అప్పటి నుంచి అయిదేళ్ల పాటు ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చిన శాస్త్రి శకం సోమవారంతో ముగిసింది. ఈ అయిదేళ్లలో రవి జట్టును ఏ మేరకు సానబెట్టాడు అని తరచి చూస్తే విజయాల శాతమే ఎక్కువగా ఉంది. శాస్త్రి కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు టెస్టుల్లో నంబర్ వన్‌గా ఎదిగింది.
సర్వత్రా ప్రశంసలు..
2017-18 దక్షిణాఫ్రికా పర్యటన, 2018 ఇంగ్లండ్ పర్యటన మినహా అన్ని సిరీసుల్లోనూ కోహ్లీ సేన జయకేతనం ఎగురవేసింది. ఇక 2018-19 ఆస్ట్రేలియా పర్యటనతో కోహ్లీ-శాస్త్రీ జోడీపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిశాయి. 70 ఏళ్లలో ఏ భారత జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఆస్ట్రేలియాను టెస్టు సిరీస్‌లో వారి సొంతగడ్డపైనే ఓడించింది టీమ్ఇండియా. అయితే 2019 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా దిగి సెమీస్‌లో ఓడడం అభిమానులను నిరాశకు గురి చేసింది. ప్రపంచకప్ తర్వాత కోచ్‌గా శాస్త్రి రెండేళ్ల కాంట్రాక్టు ముగియగా బీసీసీఐ దాన్ని 45 రోజులకు ఒకసారి, ఆ తర్వాత మరో రెండేళ్లకు పొడిగించింది. ఆ సమయంలోనే టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆరంభం కాగా, భారత్ వరుస విజయాలు సాధించింది.
2020లో న్యూజిలాండ్ పర్యటనలో టెస్టు సిరీస్ కోల్పోయినా, అదే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో రెండో సారి టెస్టు సిరీస్‌లో వారిని స్వదేశంలో కోహ్లీసేన ఓడించింది. 2021 ఆరంభంలో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ టాప్ జట్టుగా అడుగుపెట్టింది. అయితే ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. రవిశాస్త్రి మార్గనిర్దేశంలో కోహ్లీ సేన విజయాల శాతం ఏ కోచ్-సారథికి సాధ్యం కాని రీతిలో ఉంది. శాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో భారత్ 51 టెస్టులు ఆడగా, 30 విజయాలు సాధించింది. విజయాల శాతం 58.80. ఇక 91 వన్డేల్లో 57 మ్యాచుల్లో విజయం సాధించగా, విజయాల శాతం 62.64 శాతం. కోచ్‌గా తన పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన రవిశాస్త్రి, తన హయాంలో జట్టు అనుకున్న దాని కంటే ఎక్కువే సాధించింది అని అన్నాడు.
"కోచ్‌గా వృత్తిలో నాకు లభించిన సంతృప్తి చాలా గొప్పది. ఎందుకంటే ఏ ఆసియా జట్టు కూడా 70 ఏళ్లలో ఆస్ట్రేలియాను టెస్టుల్లో వారి దేశంలో ఓడించలేదు. కానీ, భారత్ రెండు సార్లు ఓడించింది. ఇది మామూలు విషయం కాదు. అది ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇంగ్లండ్‌లో కూడా జట్టు చక్కగా ప్రదర్శన చేసింది. వన్డే, టీ-20లో ప్రదర్శన మెరుగుపడింది. ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగుపడ్డాయి. మా దారిలో ప్రపంచ స్ధాయి ఆటగాళ్లు తయారయ్యారు. అనుకున్న దాని కంటే భారత జట్టు చాలా సాధించింది అని చెప్పగలను. నేను అనుకున్న దాని కంటే కూడా ఎక్కువ సాధించింది."
--రవిశాస్త్రి, భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్.